ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం మరో అడుగుముందుకేసింది. ఇందుకోసం తెలంగాణ హెల్త్ ప్రొఫైల్‌ను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్టులుగా ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాను ప్రభుత్వం ఎంపిక చేసింది.
హెల్త్ ప్రొఫైల్ సర్వేలో భాగంగా వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి 18 ఏండ్లు పైబడిన ప్రతి వ్యక్తి ఆరోగ్య సూచికలను సేకరిస్తారు. ములుగు జిల్లాలో దాదాపు 2 లక్షల 18 వేల 852 మంది 18 ఏండ్లు పైబడిన వారు ఉన్నారు.
– జ్వరం, రక్త పోటు, రక్తహీనత, రక్తంలో చక్కెర స్థాయి, వయసు తగ్గ ఎత్తు, బరువు, బ్లడ్ గ్రూపు, శరీర కొలతలు, రక్తంలో ప్రాణవాయువు, గుండె కొట్టుకునే తీరు, ఇతర అంశాలు, అనారోగ్య సమస్యలు నమోదుచేసుకుంటారు.
– రక్తం, మూత్ర నమూనాలను సేకరించి సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో పరిశీలిస్తారు.
– ప్రతి వ్యక్తి ఆధార్ నంబర్, ఇంటి అడ్రస్ వంటి వివరాలు సేకరించిన వారికి ఏకీకృత నంబర్‌ను కేటాయిస్తారు. దీంతో వ్యక్తి ఆరోగ్య వివరాలు తెలుసుకునే వీలుంటుంది. వివరాలన్నింటినీ ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ చేస్తారు. ఈ పథకంలో భాగంగా వైద్య పరీక్షల ఆధారంగా అనారోగ్య సమస్యలు ఉన్న వారికి వెంటనే చికిత్స అందిస్తారు.