దేశంలో రోజురోజుకీ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నరు. సోషల్ మీడియాలో యూజర్ల ఫేస్‌బుక్, ట్విట్టర్ అకౌంట్లను హ్యాక్ చేసి వారి ఖాతాల్లోని ఫ్రెండ్స్ అకౌంట్స్‌కు తాము ఇబ్బందుల్లో ఉన్నామని డబ్బులు పంపించమని మెసేజ్‌లతో బోల్తా కొట్టించి వేల రూపాయలు కొల్లగొడుతున్నారు. హ్యాకర్ల దెబ్బకు దేశంలో పలువురు నెట్‌జన్లు తమ అకౌంట్లను సస్పెండ్ చేసుకోవడం జరిగింది. ఈ సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా పడ్డారు. ఏకంగా దేశ ప్రధాని మోదీ ట్విట్టర్ అకౌంట్‌ను కూడా సైబర్ కేటుగాళ్లు హ్యాక్ చేశారు. అయితే పీఎంవో కార్యాలయం వేగంగా స్పందించి మోదీ అకౌంట్‌ను పునరుద్ధరించారు.
అయితే తాజాగా భారతీయ జనతా పార్టీ దేశ అధ్యక్షుడు జేపీ నడ్డా కు ఊహించని పరిణామం ఎదురైంది. జేపీ నడ్డా అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. కొంతమంది గుర్తు తెలియని సైబర్ కేటుగాళ్లు జేపీ నడ్డా అకౌంటు హ్యాక్ చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు.ఉక్రెయిన్ – రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం విశేషాలపై ట్వీట్ చేసిన సైబర్ కేటుగాళ్లు.. బిట్ కాయిన్స్ పై కూడా పలు ట్వీట్లు చేశారు. ఈ ట్వీట్స్ చేసి డబ్బులు గుంజే ప్రయత్నం చేసినట్లు సమాచారం అందుతోంది. ముఖ్యంగా ఉక్రెయిన్ దేశ ప్రజల కోసం తాము డబ్బులు వసూలు చేస్తున్నట్లు.. నడ్డా ట్విటర్ అకౌంట్ నుంచి ట్వీట్లు పెట్టారు.
అయితే విషయాన్ని భారతీయ జనతా పార్టీ దేశ అధ్యక్షుడు జేపీ నడ్డా కార్యాలయ సిబ్బంది వెంటనే గ్రహించారు. ఈ సంఘటనపై అలర్ట్ అయిన సిబ్బంది.. సైబర్ క్రైమ్ పోలీసులు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకొన్న పోలీసులు సైబర్ కేటుగాళ్లను పట్టుకునే ప్రయత్నంలో పడ్డారు. మొత్తంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాక్ చేసిన కేటుగాళ్లు..ఉక్రెయిన్ యుద్ధ బాధితుల పేరుతో డబ్బులు గుంజే ప్రయత్నం చేయడం కలకలం రేపుతోంది. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.