తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాజీనామా వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. ఫిబ్రవరి 25న కార్యకర్తలు, నాయకులు, అభిమానులతో భేటీ అయినే జగ్గారెడ్డి మార్చి 21 న సంగారెడ్డిలో లక్ష మందితో బహిరంగ సభ నిర్వహిస్తానని, ఆ సభకు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలను ఆహ్వానిస్తానని, ఆ సభలో తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం ప్రకటిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం జగ్గారెడ్డిని పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకే ప్లాన్ వేసినట్లు సమాచారం.
జగ్గారెడ్డి వంటి నేతలు కాంగ్రెస్‌లోనే ఉంటే…భవిష్యత్తులో తన రాజకీయ ఎదుగుదలకు ఇబ్బందులు తప్పవని రేవంత్ రెడ్డి భావిస్తున్నాడంట..అందుకే జగ్గారెడ్డి వ్యవహారశైలిపై తన గురువు మాణిక్కం ఠాగూర్ ద్వారా హైకమాండ్‌కు ఫిర్యాదు చేశాడంట…ఈ నేపథ్యంలో జగ్గారెడ్డికి హైకమాండ్ పెద్దలు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. పార్టీ అంతర్గత విషయాలను లీక్ చేస్తూ.. పార్టీ కార్యక్రమాలకు సహకరించకుండా.. ఇతర పార్టీలతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకొని అసమ్మతి రాగం వినిపిస్తున్న జగ్గారెడ్డిపై రేవంత్ వర్గం అధిష్ఠానానికి ఫిర్యాదు చేసిందంట.. ఇన్ని రోజులూ జగ్గారెడ్డి రాజీనామా విషయంలో వేచి చూసే ధోరణిలో కనిపించిన పార్టీ పెద్దలు ఇకపై సీరియస్ గా వ్యవహరించనున్నారని పార్టీ ముఖ్యులు అభిప్రాయపడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీని వీడను అంటూనే.. సోనియా రాహుల్ తో మాట్లాడే అవకాశం రాకపోతే తన దారి తాను చూసుకుంటానని జగ్గారెడ్డి కుండబద్ధలు కొట్టారు. మార్చి 21న సంగారెడ్డిలో లక్ష మందితో బహిరంగ సభ నిర్వహిస్తానని.. ఈ కార్యక్రమానికి వారిద్దరినీ ఆహ్వనిస్తానని అంటున్నారు. ఈ సభ ద్వారా తన బలం నిరూపించుకుంటానని స్పష్టం చేశారు. అయితే జగ్గారెడ్డి వ్యాఖ్యలపై ఢిల్లీ పెద్దలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారట. ఇలా బెదిరించిన వారందరికీ అపాయింట్మెంట్లు ఇవ్వలేమని చెబుతున్నారట. అసమ్మతి పేరిట తన వ్యక్తిగత బల ప్రదర్శన కోసం నిర్వహిస్తున్న ఈ సభకు పార్టీ సహకరించబోదని.. పార్టీ ముఖ్యులు ఎవరూ ఇందులో పాల్గొనబోరని సమాచారం. పార్టీని ధిక్కరించి ఈ సభ నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని.. ఇలాంటివి ఉపేక్షించబోమని ఢిల్లీ పెద్దలు అటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి, ఇటు జగ్గారెడ్డికి తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. మరి హైకమాండ్ ఆదేశాలను ధిక్కరించి సంగారెడ్డిలో జగ్గారెడ్డి అనుకున్నట్లుగానే బహిరంగ సభ నిర్వహిస్తాడా…రాహుల్, సోనియాగాంధీలను రప్పించుకుంటాడా లేదా…రేవంత్ రాజకీయానికి బలైపోయి చివరకు కాంగ్రెస్‌నే వీడుతారా అనేది చూడాలి.