సినీ నటుడు ప్రకాశ్ రాజ్ రాజకీయాల్లో బిజీ అవుతున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ ముంబై పర్యటనలో ప్రకాశ్ రాజ్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో జరిగిన భేటీలో సీఎం కేసీఆర్ వెంట సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఉండటంపై పొలిటికల్ సర్కిల్‌లో సరికొత్త చర్చకు దారి తీసింది. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గాన్ని ప్రకాశ్ రాజ్ సందర్శించారు.
సినీనటుడు ప్రకాశ్‌రాజ్ శనివారం గజ్వేల్ నియోజకవర్గాన్ని సందర్శించారు. గజ్వేల్ పట్టణంలోని సమీకృత మార్కెట్, వైకుంఠధామం, మహతీ ఆడిటోరియం, మల్లన్నసాగర్ ఆర్‌అండ్‌ఆర్ కాలనీ, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్‌లను ఆయన పరిశీలించారు. గజ్వేల్ ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ, మునిసిపల్ చైర్మన్ ఎన్‌సీ రాజమౌళి తదితరులు ప్రకాశ్ రాజ్‌కు స్వాగతం పలికారు. అనంతరం తొగుట మండలం శివారులో 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన మల్లన్న సాగర్‌ను ప్రకాశ్‌రాజ్ సందర్శించారు. పంపుహౌస్‌లోకి వెళ్లి అక్కడ నీటిని ఎత్తిపోస్తున్న బాహుబలి మోటార్లను పరిశీలించారు. మల్లన్న సాగర్ కట్టపైకి చేరుకుని డెలివరీ సిస్టర్నుల నుంచి వస్తున్న గోదావరి నీటిని చూసి పులకించిపోయారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆలోచనలు అభివృద్ధి రూపంలో గజ్వేల్‌లో ప్రతిబింబిస్తున్నాయని ప్రశంసించారు. దేశానికే ఆదర్శంగా గజ్వేల్ అభివృద్ధి చెందిందని, విదేశాల్లో పర్యటించిన అనుభూతి కలిగిందని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.. సీఎం కేసీఆర్ సారథ్యంలో జరుగుతున్న అభివృద్ధి, ప్రజలకు అందివచ్చిన సౌకర్యాలు, సామాజిక చైతన్యంలో గజ్వేల్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రకాశ్ రాజ్ కొనియాడారు. కాగా గజ్వేల్‌ను చూస్తే ఫారిన్ కంట్రీల్లో ఉన్నట్లు ఉందని సినీ నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు గజ్వేల్ అన్నిరంగాలలో వెనుకబడిపోయిందని సీఎం కేసీఆర్‌పై బురద జల్లుతున్న ప్రరతిపక్ష నేతలు బండి సంజయ్, రేవంత్ రెడ్డికి దిమ్మతిరిగే షాకిచ్చాయనే చెప్పాలి.