మల్లన్నసాగర్‌పై ఏపీ ప్రజలు ఏమంటున్నారో తెలుసా..?

54
mallanna sagar
- Advertisement -

తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మల్లన్న సాగర్ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. మల్లన్నసాగర్‌‌తో దాదాపు 12 లక్షల ఎకరాలకు ప్రత్యక్షంగా సాగునీరు అందడమే కాకుండా మొత్తం 20 లక్షల ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయి. అయితే ఈ బృహత్తర ప్రాజెక్టును అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ నేతలు ఏకంగా 600 కేసులు వేశారు. పదేపదే హైకోర్టు, సుప్రీంకోర్టులకు వెళుతూ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాని తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి వత్తిళ్లకు వెరువక ధృఢ సంకల్పంతో మల్లన్నసాగర్ ప్రాజెక్టును పూర్తి చేసింది. దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు భూనిర్వాసితులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టి రాజకీయం చేశారు. అయితే మల్లన్నసాగర్ ప్రారంభోత్సవంలో రఘునందన్‌రావు సైతం పాల్గొనడం గమనార్హం.

కాగా దేశంలోనే సముద్రమట్టానికి అత్యంత ఎత్తులో నిర్మించిన మానవ నిర్మిత జలాశయంగా మల్లన్న సాగర్ రికార్డు నెలకొల్పింది. మల్లన్న సాగర్ రిజర్వాయర్ ప్రాంతాన్ని టూరిస్ట్ కేంద్రంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ అద్భుత జలాశయం చూసి ప్రతి ఒక్కరూ అచ్చెరువొందుతున్నారు. తెలంగాణ ప్రజలే కాదు…ఏపీ ప్రజలు కూడా మల్లన్నసాగర్ జలాశయం చూసి పులికించిపోతున్నారు. తాజాగా తిరుపతి నుంచి సిద్దిపేట జిల్లాలో నిర్మించిన కొమురవెల్లి మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ను తిలకించేందుకు ఓ కుటుంబం వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ రిజర్వాయర్‌ను జాతికి అంకితం చేసిన కార్యక్రమాన్ని టీవీల్లో చూసిన ఆ కుటుంబం ఈ అద్భుత జల సాగరాన్ని వీక్షించాలని తరలివచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత జలాశయం, బహుళ దశల ఎత్తిపోతలను చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. మాది తిరుపతి పక్కన పాకన్నపేట.

సీఎం కేసీఆర్‌ మల్లన్నసాగర్‌ను ప్రారంభించడాన్ని టీవీల్లో చూశాం. ఎంతో అద్భుతంగా నిర్మించిన ఆ ప్రాజెక్టును తప్పకుండా చూడాలని నిర్ణయించుకొన్నాం. బుధవారం రాత్రి బయలుదేరి ఇక్కడి వచ్చాం. మల్లన్నసాగర్‌ బ్రహ్మాండంగా ఉంది. మంచి పనులు చేస్తున్న సీఎం కేసీఆర్‌ సార్‌కు కృతజ్ఞతలు. సాగునీటి కోసం సీఎం చేసిన పనులు చాలా బాగున్నాయి. మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ బండ్‌ నుంచి దిగబుద్ధి కావడం లేదంటూ ఆ కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది. సీఎం కేసీఆర్ నిర్మించిన మల్లన్నసాగర్‌పై అవాకులు చెవాకులు పేలుతున్న కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఏపీ ప్రజలను చూసి సిగ్గుతెచ్చుకోవాలని, మూడు ఉమ్మడిజిల్లాలను సస్యశ్యామలం చేసే మల్లన్న సాగర్‌పై ఇకనైనా రాజకీయం చేయడం మానుకోవాలని సోషల్ మీడియాలో నెట్‌జన్లు బండి బ్యాచ్, రేవంత్ గ్యాంగ్‌కు హితవు పలుకుతున్నరు.

- Advertisement -