అదిలాబాద్ జిల్లా కేంద్రంలో రాజుకున్న సీసీఐ ఉద్యమం బీజేపీ నేతలకు గట్టి షాక్ ఇస్తోంది. రెండు దశాబ్దాల క్రితం అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మూతపడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలని కార్మికులు, ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. ప్రతిసారి ఎన్నికల సమయంలో రాజకీయపార్టీలు సీసీఐ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి హడావుడి చేయడం..తీరా ఎన్నికల తర్వాత వదిలేయడం పరిపాటిగా మారింది.గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సీసీఐ పునరుద్ధరణ అంశాన్ని రాజకీయంగా వాడుకుంది. తమను గెలిపిస్తే సీసీఐని తెరిపిస్తామంటూ బూటకపు హామీలతో బీజేపీ అభ్యర్థి బాపురావు ఎంపీగా గెలిచారు. తీరా ఎన్నికలయ్యాక సీసీఐ రీఓపెనింగ్ అంశాన్ని గాలికి వదిలేశాడు.
నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్ ఇటీవల కూడా సీసీఐ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వ చొరవ చూపడం లేదంటూ బురదజల్లాడు. అసలు వాస్తవానికి సీసీఐ అనేది…కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థ..దాన్ని పునరుద్ధరించే అధికారం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదే. కాగా ఇప్పటికే మంత్రి కేటీఆర్ సీసీఐని తిరిగి తెరిపించాలంటూ కేంద్రానికి పలుమార్లు లేఖలు రాసినా ప్రయోజనం లేకుండా పోయింది. బీజేపీకి నలుగురు ఎంపీలు ఉన్నా…అందులో కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా ఉన్న సీసీఐని తెరిపించే ప్రయత్నం చూపలేదు సరికదా..ఉల్టా సీసీఐని తెరిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ అర్వింద్, బాపురావులు బురద జల్లుతున్నారు. అయితే తాజాగా సీసీఐ ఫ్యాక్టరీని తెరిపించాలంటూ కార్మికులు, ఉద్యోగులు రోడ్డెక్కారు. గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే సీసీఐని తెరిపించాలంటూ సీసీఐ సాధన సమితి పిలుపునిచ్చిన అదిలాబాద్ బంద్ కూడా విజయవంతం అయింది.
సీసీఐ ఉద్యమానికి అధికార టీఆర్ఎస్ అండగా నిలిచింది. స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న మంత్రి కేటీఆర్‌తో సీసీఐ రీఓపెనింగ్‌పై ఓ ప్రకటన కూడా చేయించారు. జోగురామన్న ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు సీసీఐ ఉద్యమంలో కదం తొక్కుతున్నారు. ఈనేపథ్యంలో తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగురామన్న సీసీఐ కోసం సోషల్ మీడియా వేదికగా సరికొత్త సెల్ఫీవార్ కు తెరలేపారు. జిల్లా కేందంలోని ప్రధాన చౌరస్తాలో ఐ లవ్ సీసీఐ పేరుతో ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి, దాని వద్ద సెల్ఫీ తీసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఈమేరకు లక్ష సెల్ఫీలు, కోటి సంతకాలు అనే కార్యక్రమాన్ని చేపట్టారు. సీసీఐ ఉద్యోగులు, కార్మికులు ఐలవ్ సీసీఐ సెల్ఫీ పాయింట్ వద్ద సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ…సీసీఐ ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకువెళుతున్నారు. మొత్తంగా టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఐ లవ్ సీసీఐ సెల్ఫీ వార్‌తో బండి బ్యాచ్‌కు రాజకీయంగా ఇబ్బందులు తప్పవని..వచ్చే ఎన్నికల్లో బీజేపీ చావుదెబ్బ తినడం ఖాయమని ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో చర్చ జరుగుతోంది.