తగ్గెదేలే అంటున్న జగ్గారెడ్డి..!

88
jaggareddy
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాజీనామా వ్యవహారం కాక రేపుతోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో విబేధాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు జగ్గారెడ్డి ప్రకటించారు. అయితే ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డిని బుజ్జ‌గించేందుకు వీహెచ్‌, ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి హైద‌రాబాద్‌లోని త‌న నివాసంలో భేటి అయ్యారు. ఆ స‌మావేశం అనంత‌రం జ‌గ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో జ‌రుగుతున్న వ్య‌వ‌హారాల‌తో కొంత మ‌నోవేద‌న చెందాను. నేను ఒక నిర్ణ‌యం తీసుకున్నాను. దానికి క‌ట్టుబ‌డి ఉంటాను. కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు నాతో ఫోన్‌లో మాట్లాడారు. అంద‌రం కూర్చొని ఒక‌సారి మాట్లాడ‌దాం. ముఖ్యంగా రాజీనామా నిర్ణ‌యాన్ని వాయిదా వేసుకోవాలని, తొంద‌ర ప‌డ‌వ‌ద్ద‌ని ఉత్త‌మ్ కోరారు. మీ అభిప్రాయాల‌ను ఢిల్లీ వెళ్లి చెప్పాల‌ని స‌ల‌హా ఇచ్చారు. అదేవిధంగా కొద్ది రోజుల పాటు మీడియాతో కూడా మాట్లాడ‌వ‌ద్ద‌ని సూచించారు.

10 రోజుల త‌రువాత నా నిర్ణ‌యంలో ఎలాంటి మార్పు ఉండ‌క‌పోవ‌చ్చు. ఢిల్లీ వెళ్లి వ‌చ్చాక నా నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తాను అని జ‌గ్గారెడ్డి చెప్పారు. అయితే తాజాగా టీ కాంగ్రెస్ లోని లోపాలని చెబుతూ జగ్గారెడ్డి ఢిల్లీ హైకమాండ్ కి రాసిన లేఖ ఇప్పుడు రాజకీయవర్గాల్లో దుమారం రేపుతోంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు చాలా మంది పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. అయితే కాంగ్రెస్‌లోకి ఎవరైనా సడన్‌గా వచ్చి లాబీయింగ్ చేస్తే పిసిసి అవ్వచ్చు. ఇంతకంటే తప్పు నేను చేయలేదు. పైగా సొంత పార్టీలోనే కుట్రపూరితంగా ప్రణాళికాబద్ధంగా జగ్గారెడ్డి టిఆర్ఎస్ కోవర్టులని ప్రచారం సాగుతోంది. అయినప్పటికీ దీన్ని ఖండించే వ్యవస్థ కాంగ్రెస్‌ పార్టీలో లేకపోవడం దురదృష్టం అని జగ్గారెడ్డి ఆ లేఖలో వాపోయారు. ఇక్కడ ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే…కోవర్టు అనే ప్రచారాన్ని ఇక్కడ ఉన్న కొందరు నాయకులే యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ప్రచారం చేయిస్తున్నారని పరోక్షంగా రేవంత్ రెడ్డి ఫ్యాన్స్‌ను ఉద్దేశిస్తూ ఫిర్యాదు చేశారు.

ఇటీవల రాష్ట్రంలో 12 స్థానాలకు జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో నా భార్య నిర్మల చేత పోటీ చేయించి ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ ఓట్ల కంటే ఒక ఓటు తగ్గినా కూడా ఆ పదవికి రాజీనామా చేస్తానని చెప్పానని… పార్టీ పరువు మర్యాద ముఖ్యమని అనుకున్నాను… కానీ పార్టీలోని కొందరు నన్ను కేసీఆర్ కోవర్ట్ అని ప్రచారం చేయిస్తారా అని నిలదీశారు. రాహుల్‌గాంధీని అస్సాం బీజేపీ సీఎం హిమంత బిశ్వశర్మ వ్యక్తిగత విమర్శలు చేస్తే ఒక్క రోజు వరకు స్పందించని వారు పార్టీలోని కోవర్టులా…లేదా స్పందించిన నేను కోవర్టునా అని హైకమాండ్‌ను జగ్గారెడ్డి తన లేఖలో నిలదీశారు. 2017 లో రాహుల్ గాంధీ సభ పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదు.అటువంటి సమయంలో నేను కోట్లు ఖర్చు పెట్టానని చెప్పుకొచ్చారు. ఎవరైనా తప్పుడు తోవలో వెళ్తుంటే నేను మాట్లాడకుండా ఊరుకోవాలా అని జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ కోసం ఇంత కష్టపడుతుంటే నాపై ఇంత దరిద్రంగా టీఆర్ఎస్ కోవర్ట్ అని ప్రచారం చేస్తారా అంటూ రేవంత్ వర్గంపై పరోక్షంగా ఆ లేఖలో మండిపడ్డారు.మొత్తంగా రేవంత్ రెడ్డి వర్గం తనపై టీఆర్ఎస్ కోవర్ట్ అంటూ ప్రచారం చేస్తుండడం భరించలేక పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు రాహుల్‌గాంధీకి రాసిన లేఖలో జగ్గారెడ్డి చెప్పకనే చెప్పారు. ప్రస్తుతం రాహుల్‌గాంధీకి జగ్గారెడ్డి రాసిన లేఖ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -