తనను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ అధిష్టానానికి జగ్గారెడ్డి లేఖరాయడంపై స్పందించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. టీ కప్పులో తుపాను మాదిరే ఈ సమస్య కూడా పరిష్కారమవుతుందని చెప్పారు. తమ పార్టీలో విభేదాలు లేవని, భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని అన్నారు. గోతికాడ నక్కల మాదిరి టీఆర్ఎస్ నేతలు ఆడే ఆటలు సాగవని చెప్పారు.
కుటుంబం అన్నాక ఎన్నో సమస్యలు ఉంటాయని, అన్ని సమస్యలను తామే పరిష్కరించుకుంటామని చెప్పారు. మీడియా ఈ అంశాన్ని పెద్దగా చూపాల్సిన అవసరం లేదని అన్నారు.
అంతకముందు రేవంత్ రెడ్డి టార్గెట్గా లేఖ రాశారు జగ్గారెడ్డి. త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని…కాంగ్రెస్ పార్టీని వీడిన గాంధీ కుటుంబంపై గౌరవంతో ఉంటానని పేర్కొన్నారు. త్వరలో పార్టీ పదవికి , కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ఆయన తేల్చిచెప్పారు. సొంత పార్టీలోనే కుట్రపూరితంగా కాంగ్రెస్ కోవర్టుగా ముద్రవేస్తున్నారు. ఇది బాధ కలిగించే విషయమని ఆవేదన వ్యక్తం చేశారు.