తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌పై కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్షాలు చేస్తోన్న విమర్శలను మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తిప్పి కొట్టారు. ఇవాళ ఆయన టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టుతోందని, బాకీల తెలంగాణగా మారుస్తున్నారని అనడం సరికాదన్నారు. ఇది అప్పుకాదు, అభివృద్ధికి పెట్టుబడి అన్నారు. ఇవాళ ఖర్చుపెట్టే ప్రతీ పైసా రేపు మళ్లీ పెట్టుబడి నిస్తుందని వివరించారు.
రుణాలు తీసుకోకుండా ఏ రాష్ట్రం అభివృద్ధి చెందదని తెలిపారు. కాంగ్రెస్ నేతలు ప్రజలను ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారో అర్థం కావడంలేదన్నారు. ప్రతిపక్షాలు అవగాహనలేకుండా మాట్లాడుతున్నాయని విమర్శించారు. విపక్షాలు బడ్జెట్‌ను తప్పుపట్టడం సరికాదన్నారు. రాష్ట్ర బడ్జెట్‌ను చూసి కాంగ్రెస్ పార్టీకి కళ్లు బైర్లు కమ్ముతున్నాయని దుయ్యబట్టారు. 60 ఏళ్ల పాలనలో ఆగమైన తెలంగాణను బాగుచేయడానికి అప్పులు తెస్తే తప్పా? అని ప్రశ్నించారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే దిశగా సీఎం కేసీఆర్ బడ్జెట్ కేటాయింపులు చేశారని వివరించారు. నేతన్నలు, యాదవులు, కురుమలు, గంగపుత్రులు, ముదిరాజ్‌లు సంబురాలు జరుపుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ నేతలు బావదారిద్య్రంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. బడ్జెట్‌ను ప్రజలంతా స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. శ్రీలంక దేశంకన్నా తెలంగాణ రాష్ట్రం ఎక్కువ జీఎస్‌డీపీని కలిగి ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. మిషన్ భగీరథకు పెట్టుబడులు పెట్టేందుకు కొన్ని సంస్థలు ముందుకు వస్తుంటే ప్రతిపక్షాలకు ఎందుకంత కంటగింపు అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీని దేశంలో ఎవరూ ఆదరించడంలేదని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీకి రూ.వెయ్యి కోట్లు కేటాయించిన సీఎం కేసీఆర్, ఈటెలకు ధన్యావాదాలు తెలిపారు.