కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా ఏఐకేఎస్ రాష్ట్రవ్యాప్త నిరసన..

100
venkat
- Advertisement -

కార్పొరేట్‌ అనుకూల కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నిర్వహించాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం పిలుపునిచ్చింది. గోల్కొండ క్రాస్‌ రోడ్‌ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమంలో నాయకుల పిలుపునిచ్చారు. 2022-23 మొత్తం బడ్జెట్‌ 39,44,999 కోట్లు కాగా, వ్యవసాయ బడ్జెట్‌ 1.24 లక్షల కోట్లు మాత్రమే కేటాయించారు. మొత్తం బడ్జెట్‌లో 3.14 శాతం మాత్రమే కేటాయించారు. గత బడ్జెట్‌పై 1000 కోట్లు మాత్రమే పెంచడం జరిగింది. దేశ ప్రజానికాన్ని నిరాశపరిచిందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి బి వెంకట్‌, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్‌, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం సాయిబాబు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్‌ వెంకట్రాములు అభిప్రాయపడ్డారు. కార్పొరేట్‌ అనుకూల బడ్జెట్‌కు వ్యతిరేకంగా ఫిబ్రవరి 2 నుండి వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

హైదరాబాద్‌లోని గోల్కొండ క్రాస్‌రోడ్‌ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను ప్రజాసంఘాల ఆధ్వర్యంలో దహనం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ… ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్‌లకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకుందని అన్నారు. కార్పొరేట్‌ పన్నును 12 శాతం నుండి 7శాతానికి తగ్గించిందని ఆందోళన వ్యక్తంచేశారు. బడ్జెట్‌ కేటాయింపులను పరిశీలిస్తే వ్యవసాయ రంగానికి గత సంవత్సరం కన్నా తక్కువ నిధులు కేటాయించడం జరిగింది. మార్కెట్‌ జోక్యం పథకంకు, ఏఐబిపి ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు, వర్షభావ ప్రాంతాలకు, జాతీయ ఆహార భద్రతకు, వడ్డీమాఫీకి, ప్రకృతి వైపరీత్యాలకు, ఆత్మహత్యల నివారణకు బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ, ధాన్యం సేకరణకు ఎఫ్‌సిఐకి రుణం ఇస్తున్నామని బడ్జెట్‌లో చెప్పిన అంశాలు ఆర్థిక నివేదికలో లేవు. కిసాన్‌ సమ్మాన్‌ పెంచుతామని 14 కోట్ల మంది రైతులను ఇస్తామని ఒకవైపు చెప్తూనే మరోవైపు 11 కోట్ల మందికే కేటాయించినట్లు చెప్పారు. కానీ కేటాయించిన నిధులు 6 కోట్ల కుటుంబాలకు కూడా సరిపోవు. పరిశోధనలకు కేటాయింపులు పెంచకపోవడంతో టెక్నాలజీని ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. ఇతర టెక్నాలజీ ఇక్కడికి దిగుమతి అయితే అది మన ఉత్పత్తికి దోహద పడదు. పరిశోధనలకు కేటాయించిన 8,513 కోట్లలో 5,877 కోట్లు మాత్రమే ఐసిఎఆర్‌కు కేటాయించడం జరిగింది. వ్యవసాయ విశ్వ విద్యాలయాలకు గత సంవత్సరం 563 కోట్లు కేటాయించగా, ఈ సారి 599 కోట్లు మాత్రమే కేటాయించారు.

దేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు కనీసం 100 కోట్ల చొప్పున కేటాయింపు చేయాల్సింది. ఆత్మహత్యల నివారణకు ఎలాంటి చర్యలు చూపలేదు. భూసార పరీక్షలు, భూముల డిజిటలైజేషన్‌ ప్రక్రియకు కావాల్సిన నిధులను కేటాయించలేదు. గతంలో 3 నల్ల రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చిన ప్రభుత్వం అదే దారిలో వ్యవసాయ రంగాన్ని దివాళ తీయించి కార్పొరేట్‌ సంస్థలు హస్తగతం చేసుకోడానికి ఈ బడ్జెట్‌లో అవకాశాలు కల్పించారు. ప్రస్తుత బడ్జెట్‌ను పున:పరిశీలించి వ్యవసాయ రంగానికి కనీసం మొత్తం బడ్జెట్‌లో 10 శాతం కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు నాయకులు నరేష్‌ తదితరులు పాల్గొన్నారు..

- Advertisement -