ఇది వెయ్యేళ్ల క్రితం రామానుజాచార్యులు చెప్పిన సమతా సూత్రం..

66
- Advertisement -

సోమవారం ముచ్చింతల్ శ్రీరామనగరం జీవా ప్రాంగణం ఆడిటోరియంలో శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలపై చిన్న జీయర్ స్వామి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామానుజాచార్యులు ఆధ్యాత్మికవేత్త మాత్రమే కాదు.. సాంఘిక విప్లవాన్ని అందించిన మహనీయులు సమత స్ఫూర్తికి ఆకారం.భారతదేశపు ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన మహనీయులు రామానుజాచార్యులు. ఆయన వెయ్యేళ్ల పండుగ సందర్భంగా ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు ఎన్నో ఉపయోగకరమైన కార్యక్రమాలు చేసుకోబోతున్నామన్నారు.

కోవిడ్ పరిస్థితుల్లో ఆ ప్రభావాన్ని తగ్గించుకోవడానికి అద్భుతమైన 1035 కుండాలతో హోమాలు జరుపుతాం. వైరస్ నే కాకుండా.. మానవ మనసులో దాగిన వైరస్‌ను తొలగించడానికి ముఖ్యమైన కార్యక్రమం చేసుకోబోతున్నాం. సమాజాన్ని పట్టి పీడించే భయంకరమైన వైరస్ అసమానత.. ఒక వ్యక్తి మరో వ్యక్తిని గౌరవించే లేకపోతున్నాడు. సమాజంలోని కులాలు, మతాల మధ్య అసమానత కొరవడుతోంది. పరస్పరము కలిసి ఉండే వాతావరణాన్ని చూడలేకపోతున్నాం.. ఇది కోవిడ్ కంటే ప్రమాదకరమైన వైరస్. బయట వచ్చే జబ్బులకు వ్యాక్సిన్స్ ఇవ్వాలి.. ప్రమాదకరమైన భయంకరమైన మనసులో వ్యాపించిన వైరస్ కు వ్యాక్సిన్ వెయ్యేళ్ళ క్రితం మానవ సమాజంలో రామానుజాచార్యులు అందించారు.. అదే సమానతా వ్యాక్సిన్ అని జీయర్‌ స్వామి అన్నారు.

ధనంలో, జ్ఞానంలో హెచ్చుతగ్గులు ఉంటాయి.. ఇవన్నీ ఉంటున్నా ఒకే సమాజంగా మానవులు బతకాలి.. ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు. అంతరమైన జబ్బులకు మందును రామానుజాచార్యులు వెయ్యేళ్ళ క్రితం కనిపెట్టి మనకు ఇచ్చారు.. అదే సమతా స్ఫూర్తి.. శరీరంలోని అన్ని భాగాలు ఒకేలా ఉండవు.. ఒకదానిపై ఒకటి ఆధిపత్యం చెలాయించవు.. సమన్వయంతో పని చేస్తాయి. సమాజంలో ఎన్నో కులాలు, మతాలు, జాతులు ఎన్నో అంతరాలు ఉన్న వ్యక్తులు ఉంటారు.. అందరూ సమన్వయంతో కలిసి బతకాలి.. దీన్నే సమానతా అంటాం.. ఇది వెయ్యేళ్ల క్రితం రామానుజాచార్యులు చెప్పిన సమతా సూత్రం.. ఎందులోనూ వివక్ష ఉండకూడదూ అనేదే రామానుజాచార్యులవారి సమతా స్ఫూర్తి. సమాజానికి సమతా స్ఫూర్తి, సమతా సూత్రం మందుగా కావాలి.

12 రోజుల పాటు అద్భుతమైన యాగాలు చేసుకోబోతున్నాం.. ఇది శాస్త్రీయమైన, వైదిక విధానం. రాబోయే తరాలకు రామానుజాచార్యుల స్ఫూర్తిని తెలపాలని ఈ కార్యక్రమం చేస్తున్నాం. మనిషి అవసరానికి మించి ప్రకృతిని నాశనం చేస్తున్నాడు.. ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణికి ఒక్కొక్క ఉనికి ఉంది.. వాటికి హాని కలిగించకూడదు కాపాడాలి. మాధవ సేవే సకల కోటి సేవగా భావించాలి. మనం చేసే మంచి పనులతో ప్రకృతి పులకిస్తుంది.. వానలు కురుస్తాయి.. పంటలు బాగా పండుతాయి. వెయ్యి ఏళ్ళ క్రితం శ్రీ రామానుజాచార్యులు సమాజంలో మార్పులకు శ్రీకారం చుట్టారు.. మహిళా సాధికారత కోసం కృషి చేశారు. అస్పృశ్యత మహమ్మారి ఇప్పటికీ వ్యాపించి ఉంది.. వెయ్యేళ్ల క్రితం ఇంకా ఎలా ఉండేదో ఊహించుకోవాలి. ఆలయాల్లోకి దళితులను రానిచ్చేవారు కాదు.. అలాంటి సమాజంలో రామానుజాచార్యులు ప్రతి వ్యక్తి భగవంతుడి సంతానమే అని బోధించారు. వ్యక్తిలో ఉండే గుణం ప్రధానం కానీ.. కులం ప్రధానం కాదని రామానుజాచార్యులు బోధించారు.

అందరినీ ఆలయాల్లోకి ప్రవేశం కల్పించిన భారతీయ చరిత్రలో మొట్టమొదటి వ్యక్తి. 16వ శతాబ్దం వరకు రామానుజాచార్యులు చూపిన మార్గంలో నడుచుకున్నారు కానీ.. ఆతర్వాతి రకరకాల దాడులతో ప్రజల్లోని కలయికను తొలగించారు. మంచి రోజులు వస్తున్నాయి.. అందుకు నూతన విద్యా విధానం నిదర్శనం. ప్రపంచంలో సమానత్వం కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తుల సమాచారాన్ని ‘స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ దగ్గర ఏర్పాటు చేస్తం..మతం వ్యక్తుల వికాసానికి.. సామాజిక సంఘర్షణకు ఉపయోగపడాలి. భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే..సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రంలో డిజిటల్ లైబ్రరీ రూపొందిస్తున్నాం.భారత్, నేపాల్ లోని 108 దివ్యదేశాలను రామానుజాచార్యుల విగ్రహం చుట్టూ ఏర్పాటు చేసుకున్నాం.. అక్కడి వరకు వెళ్లలేని వాళ్లకు ఒకే దగ్గర అన్ని దివ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు.. ఆయా క్షేత్రాల్లోని సాలగ్రామాలను తీసుకొచ్చాము.

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారతదేశంలోని మట్టికి ఒక అద్భుతమైన రుచి, వాసన ఉంటుంది.. అలా 108 దివ్య క్షేత్రాల మృత్తిక ఇక్కడ తీసుకొచ్చాం.. శ్రీ లక్ష్మీనారాయణ యాగంలో ఒకటిన్నర లక్షల కిలోల దేశీ ఆవుల పాలతో చేసిన నేతిని ఉపయోగిస్తాం.. ఈ కార్యక్రమంతో ప్రకృతిలో మార్పు వస్తే జీవకోటి బాగుపడుతుంది. 5 వేల మంది రుత్వికులు యజ్ఞయాగాదులలో పాల్గొంటారు. 12 రోజుల పాటు నాలుగు వేదాలను రుత్వికులు విజ్ఞాపన చేస్తారు. మానవ జాతి మనుగడ కోసం ఇక్కడ పారాయణాలు జరుగుతాయి. ఈ ప్రాజెక్టులో తొమ్మిది సంఖ్య ఆధారం చేసుకొని నిర్మాణాలు చేశాం.. రామానుజాచార్యుల విగ్రహం ఆకృతి కోసం ఎందరో మహానుభావులు కృషి చేశారు అని చిన్న జీయర్‌ స్వామి పేర్కొన్నారు.

- Advertisement -