భాజపాకు బ్రహ్మరథం పట్టారు..

192
BJP UP Election in big Victory
- Advertisement -

యూపీ ఓటర్లు మోదీ సారథ్యంలోని భాజపా కూటమికి బ్రహ్మరథం పట్టారు. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 1980నాటి ఫలితాలను గుర్తు చేశాయి. 1980లో కాంగ్రెస్‌ పార్టీ అత్యధికంగా 309స్థానాలను కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ, ఇప్పుడు యూపీలో భాజపా ఆనాటి ఫలితాలను సైతం దాటేసి మొత్తం 315కు పైగా స్థానాలను దక్కించుకుంది. మొత్తం 403 స్థానాల్లో భాజపా 315పైన నియోజకవర్గాల్లో విజయబావుటా ఎగురవేసింది. 2017 వరకు ఏ పార్టీ 1980నాటి మార్కును అందుకోకపోవడం గమనార్హం. సునామీలా దూసుకువచ్చిన భాజపా ధాటికి ఎస్పీ-కాంగ్రెస్‌ కూటమి 55 స్థానాలకే పరిమితమైంది.BJP UP Election in big Victory

1977లో జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ ఏకంగా 352 స్థానాలు దక్కించుకుంది. అప్పుడు కాంగ్రెస్‌ కేవలం 47స్థానాలకే పరిమితమైంది. ఆ తర్వాత 1980లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పుంజుకుని 47 నుంచి 309 స్థానాలు దక్కించుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తాజా ఎన్నికల ఫలితాలను గమనిస్తే… 1977, 1980నాటి పరిస్థితులు పునరావృతమైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. 2012 ఎన్నికల్లో భాజపా 47స్థానాలకే పరిమితమైంది. ఆ తర్వాత అంటే తాజా ఎన్నికల ఫలితాల్లో భాజపా 47 స్థానాల నుంచి 315పైగా స్థానాలను దక్కించుకుంది. దీంతో 1980నాటి కాంగ్రెస్‌ రికార్డును భాజపా తుడిచి పెట్టేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు అత్యధిక స్థానాలు గెలిచిన మూడో పార్టీగా భాజపా చరిత్ర సృష్టించింది. మొదటిసారి 1951లో ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్‌ 388 స్థానాలు కైవసం చేసుకుంది. ఆ తర్వాత 1977లో జనతా పార్టీ 352 స్థానాల్లో విజయబావుటా ఎగురవేసింది.

2016 నవంబరు 8న కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసింది. నోట్ల రద్దు తర్వాత వచ్చిన ఎన్నికల్లో భాజపా నిర్ణయాన్ని ప్రజలు ఏమేరకు ఆమోదిస్తారో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తాజా ఫలితాలను విశ్లేషిస్తే నోట్ల రద్దు నిర్ణయానికి ప్రజలు ఆమోదముద్ర వేసినట్లు కన్పిస్తోంది. దీంతో భాజపా శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు సగం కంటే ఎక్కువ 202 ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కానీ భాజపా ఎవరి మద్దతు అవసరం లేకుండా, పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.

- Advertisement -