సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆవిర్భావం నుంచి తెలంగాణ రాష్ట్రం సమాఖ్య స్ఫూర్తిని ప్రదర్శిస్తోందని సీఎం అన్నారు. సమాఖ్య స్ఫూర్తిని మరింద దృఢంగా కొనసాగిస్తామన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించేందుకు ప్రతినబూనుదామన్నారు.
ప్రజలే స్వయం పాలకులై తమ ప్రభుత్వాలను నిర్దేశించుకునే సర్వసత్తాక సార్వభౌమాధికారం భారత దేశ ప్రధాన లక్షణం. భిన్న సంస్కృతులు, విభిన్న సంప్రదాయాలు, విలక్షణమైన సామాజిక భిన్నత్వంతో కూడిన ఏకత్వాన్ని ప్రదర్శించడమే దేశ గొప్పతనం. పలు రకాల వేష భాషలు, ప్రాంతాలు, నైసర్గిక స్వరూపాలతో కూడిన భారతదేశం రాష్ట్రాల సమాఖ్యగా ఏకత్వాన్ని దృఢంగా కొనసాగించడం గర్వకారణం. ఇది దేశ ప్రజల రాజనీతి దార్శనికతకు నిదర్శనంగా నిలిచింది. పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా దేశ ప్రజాస్వామిక పునాదులను మరింత పటిష్టపరిచేందుకు రాజ్యాంగంలో రాష్ట్రాలకు పొందుపరిచారు. మన దేశ ముఖచిత్రానికి రాష్ట్రాలు ప్రతిబింబాలుగా నిలిచాయి. యూనియన్ ఆఫ్ స్టేట్స్గా ప్రపంచ రాజకీయ చిత్రపటంలో వెలుగొందుతున్న దేశం రాష్ట్రాల హక్కులు మరింతగా సంరక్షించబడడంతోనే భారత ప్రజాస్వామ్య ఖ్యాతి దశదిశలా ఫరిడవిల్లుతుంది.. అని సీఎం కేసీఆర్ తెలిపారు.
భారతదేశంలో నూతనంగా అవతరించిన తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగం అందించిన ఫెడరల్ స్ఫూర్తిని ప్రారంభం నుంచీ ప్రదర్శిస్తోంది. రాజకీయాలను, పరిపాలనను మిళితం చేయకుండా తెలంగాణ రాష్ట్రం నెరుపుతున్న రాజ్యాంగబద్ధమైన రాజనీతి నేడు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. రాజ్యాంగ నిర్మాతలు అందించిన ఫెడరల్ స్ఫూర్తిని మరింత దృఢంగా కొనసాగించడానికి కంకణబద్ధులమై ఉందాం. అందుకు అచంచల విశ్వాసంతో ప్రతినబూనుదామం.. అని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.