కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి రేసులో జానారెడ్డి…?

125
jana reddy
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్‌లో అజాత శత్రువు, అత్యంత సీనియర్ నేత అయిన జానారెడ్డి మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవబోతున్నారా…టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి, సీనియర్లకు మధ్య విబేధాల నేపథ్యంలో అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిగా జానారెడ్డి కాంగ్రెస్ రాజకీయాలను శాసించనున్నారా….మిర్యాలగూడలో కాంగ్రెస్ సభ్యత్వ సమావేశంలో మరో సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి జానారెడ్డి పాల్గొనడం కాంగ్రెస్ పార్టీలో కొత్త చర్చకు దారి తీసిందా…..సాగర్ ఉప ఎన్నికల్లో ఓటమితో ఇక రాజకీయాల నుంచి నిష్క్రమించడం ఖాయమని భావించిన తరుణంలో పడి లేచిన కెరటంలా జానారెడ్డి మళ్లీ తెరపైకి దూసుకువస్తున్నారా..ప్రస్తుతం జానారెడ్డి రీ ఎంట్రీ కాంగ్రెస్ పార్టీలో హాట్‌టాపిక్‌గా మారింది. గత కొన్నాళ్లుగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ సీనియర్లకు మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది. దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో ఢక్కామొక్కీలు తిన్న సీనియర్లు నిన్నకాక మొన్న పార్టీలోకి వచ్చిన జూనియర్ రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో పని చేసేందుకు ఇష్టపడడం లేదు..అటు రేవంత్ కూడా సీనియర్లను తన దారికి తెచ్చుకోకుండా పంతంతో వారిని పార్టీ నుంచే సాగనంపే ప్రయత్నాలు చేస్తున్నాడు.

దీంతో జగ్గారెడ్డి, కోమటిరెడ్డి, భట్టి వంటి సీనియర్లు రేవంత్‌పై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఈటైమ్‌లో సీనియర్ నేత జానారెడ్డి మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చారు. సాగర్ ఉప ఎన్నికల్లో ఓటమితో జానారెడ్డి దాదాపుగా ఇంటికే పరిమితమయ్యారు. ఇక రాజకీయాల నుంచి విరమించుకుని వచ్చే ఎన్నికల్లో తన వారసులను బరిలోకి దింపుతారని అంతా భావించారు. గతంలో కాంగ్రెస్ సీనియర్లపై రేవంత్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టడంపై జానారెడ్డి ప్రెస్‌‌మీట్ పెట్టి మరీ ఫైర్ అయ్యారు. అయితే మిగిలిన సీనియర్లలా రేవంత్‌ను పూర్తిగా వ్యతిరేకించడం లేదు..అలాగని పూర్తిగా మద్దతు ఇవ్వడం లేదు… ప్రస్తుతం గాంధీభవన్‌లో జరిగే పీఏసీ మీటింగ్‌లకు జానా అలా వచ్చి ఇలా మాయమవుతున్నారు. రేవంత్‌కు, సీనియర్లకు మధ్య గొడవలో తలదూర్చడం లేదు.. నా అవసరం వచ్చినప్పుడు కచ్చితంగా వస్తానంటూ తనదైన శైలిలో నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా ఉన్న జానారెడ్డి.. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో నాగార్జునసాగర్, మిర్యాలగూడ స్థానాల నుంచి తాను, తన కుమారుడు పోటీ చేయాలని ప్రయత్నించారు. కాని కుదరలేదు. ఈసారి మాత్రం కచ్చితంగా తన కుమారుడిని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించాలని జానా గట్టిగా నిర్ణయించుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

సాగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో ఒక చోట నుంచి తాను, మరో చోట నుంచి తన కుమారుడు రఘువీర్ రెడ్డి బరిలో ఉండేలా జానారెడ్డి ప్రయత్నాలు మొదలెట్టారు. అందుకే మిర్యాలగూడలో జరిగిన కాంగ్రెస్ సభ్యత్వ సమావేశానికి జానారెడ్డి హాజరైనట్లు తెలుస్తోంది. కాగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్లకు చెక్ పెట్టేందుకు కుటుంబానికి ఒకటే టికెట్ అనే రూల్‌ను రేవంత్ రెడ్డి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే జానారెడ్డికి హైకమాండ్ వద్ద ఉన్న మంచి గుర్తింపుతో ఆయనకు రెండు టికెట్లు సాధించడం పెద్ద విషయం ఏమి కాదు..పైగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్థి రేసులో అందరికంటే ముందుగా నిలిచేది జానారెడ్డి మాత్రమే. రేవంత్‌‌ రెడ్డిని సీఎంగా అంగీకరించని పక్షంలో కాంగ్రెస్ సీనియర్లు కూడా మధ్యేమార్గంగా అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడిగా జానారెడ్డిని సీఎంగా చేసేందుకు ముందుకు రావచ్చు… సుదీర్ఘ రాజకీయ, పాలనా అనుభవం , అవినీతి మరకలు లేకపోవడం, అందరిని కలుపుకుపోయే గుణం జానారెడ్డికి ప్లస్ పాయింట్స్…కాగా ఓటుకు నోటు కేసు, పాలనా అనుభవం లేకపోవడం, అందరినీ కలుపుకుపోయే తత్వం లేకపోవడం రేవంత్‌కు మైనస్ పాయింట్స్. మొత్తంగా రాజకీయాల నుంచి రిటైర్ అవుతారని భావించిన జానారెడ్డి అనూహ్యంగా రాజకీయాల్లోకి యాక్టివ్ కావడం రేవంత్ రెడ్డి వర్గానికి షాక్ ఇస్తోంది. జానారెడ్డి యాక్టివ్ కావడంతో రేవంత్ రెడ్డి సీఎం ఆశలకు గండిపడినట్లు అని గాంధీభవన్‌లో చర్చ జరుగుతోంది.

- Advertisement -