’16’: రివ్యూ

395
- Advertisement -

యువతరం దర్శకులకు మంచి ఆదరణ అభించాలంటే.. కొత్త తరహా కథలతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలి. ఇదే తరహాలో  క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కిన ధృవంగల్ పతినారు సినిమాతో తమిళ ఆడియన్స్ మెప్పు పొందిన దర్శకుడు కార్తీక నరేన్. అదే సినిమాను ఇప్పుడు 16 ఎవ్రీ డీటెయిల్ కౌంట్స్ పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న  రెహమాన్  ’16’ సినిమాతో మళ్ళీ ప్రేక్షకులను ముందుకొచ్చాడు. రెహమాన్‌ ప్రధాన పాత్రలో నటించిన ’16’  తెలుగు ఆడియన్స్ ను ఎంత వరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం.!

కథ:

దీపక్ (రెహమాన్) ఓ రిటైర్డ్ పోలీస్ అధికారిగా పరిచయం అవుతాడు. పోలీస్ ఆఫీసర్ కావాలని ఆశపడే ఓ యువకుడు.. దీపక్ అనుభవాలు, సలహాలు తెలుసుకోవాలనుకుంటాడు. కానీ అప్పటికే ఓ కేసు వల్ల తన కాలు కోల్పోయిన దీపక్, పోలీసు ఉద్యోగంలో చేరవద్దని సలహా ఇస్తాడు. 5 ఏళ్ల క్రితం తాను డీల్ చేసిన కేసు విషయాలను ఆ యువకుడికి వివరించటం మొదలు పెడతాడు.

ముందుగా ఓ వ్యక్తి రోడ్డు మీద తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడన్న కేసు దీపక్ దృష్టికి వస్తోంది. ఆ కేసు వివరాలు తెలుసుకుంటుండగానే, ఓ అపార్ట్ మెంట్ లో అమ్మాయి మిస్ అయ్యిందన్న మరో కేసు డీల్ చేయాల్సి వస్తుంది. అయితే మిస్ అయిన అమ్మాయి రూంలో గోడ మీద ఉన్న రక్తపు మరకలు తప్ప ఎలాంటి ఆధారం దొరకదు. అదే సమయంలో ఆత్మహత్య చేసుకున్న అబ్బాయి ఎవరు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు లాంటి వివరాలు కూడా దొరకవు. మిస్టరీగా మారిన ఈ రెండు కేసులను దీపక్ ఎలా పరీక్షించాడు..? అసలు ఈ రెండు వేరు వేరే కేసులా..లేక ఒకే కేసా..? ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో దీపక్ కు ప్రమాదం ఎలా జరిగింది..? చిరవకు ఆ కేసు ఏం అయ్యింది..? అన్నదే మిగతా కథ.

 16 Telugu Movie Review

ప్లస్ పాయింట్స్ :

సినిమాను ఓపెన్ చేయడమే ఒక అపార్ట్మెంట్లో జరిగే యువతి యువకుల హత్య ద్వారా ఓపెన్ చేసిన దర్శకుడు కార్తిక్ నరేన్ తన మేధస్సునంతా ఉపయోగించి ఆరంభం నుండి చివరి దాకా ఎక్కడా ప్రేక్షకుడికి తనంతట తానుగా అసలు నిజం ఏమిటో తెలుసుకునే అవకాశం ఇవ్వలేదు. దీంతో కథనం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ చాలా థ్రిల్లింగా అనిపించింది. ఎంతలా అంటే దర్శకుడు క్రైమ్ థ్రిల్లర్ కు చేయవలసిన న్యాయం దాదాపు పూర్తిగా చేసేశాడు అనిపించేంత.చివరి క్లైమాక్స్ అయితే అబ్బో ఏమి తీర్పు అనేలా ఇచ్చాడు. ఒకేసారి ఒక పోలీస్ ఆఫీసర్ కర్తవ్య నిర్వహణ ఎలా ఉండాలి, ఆవేశంలో తీసుకున్న నిర్ణయాల పర్యవసానం ఏమిటి అనే అంశాల్లోనే కథ మొత్తానికి తీర్పు చెప్పడం బాగుంది. ఇక ప్రధాన పాత్ర చేసిన రహమాన్ నటన సినిమాకు కావాల్సినంత సీరియస్, సిన్సియర్ ఫీలింగ్ ను తీసుకొచ్చింది. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సన్నివేశాల్లోని ఇంటెన్సిటీని చాలా బాగా క్యారీ చేశాయి.

ఇక ‘రెహమాన్‌ ఒప్పుకోకపోతే ఈ సినిమా చేసుండేవాడ్ని కాదు’ అని ఓ సందర్భంలో దర్శకుడు చెప్పాడు. అది అక్షరాలా నిజం. రెహమాన్‌ని ఈ తరహా సీరియస్‌ పాత్రలో చూడ్డం కొత్త. మరెవరైనా అయితే రొటీన్‌గా అనిపించేదేమో. తన పాత్రకి వంద శాతం న్యాయం చేశాడాయన. తెరపై కనిపించే ప్రతీ నటుడూ, నటి.. పాత్రకు ఎంత కావాలో అంతే నటించారు. సాంకేతికంగా ఇది దర్శకుడి సినిమా. ఇలాంటి థ్రిల్లర్స్‌ని తెరకెక్కించాలంటే చాలా అనుభవం, నేర్పు కావాలి. కథనంలో పట్టు ఉండాలి. అది దర్శకుడు చూపించాడు. నేపథ్య సంగీతం చక్కగా కుదిరింది. గంటన్నరలో ఈ సినిమా ముగించారు. అది మరో ప్లస్‌ పాయింట్‌.

మైనస్ పాయింట్స్ :

సినిమా మొదలైన దగగర్నుంచి ఇంటర్వెల్ పడే వరకు క్లాస్ రూమ్ లో కూర్చున్నట్టు దర్శకుడు ప్రేక్షకుల మీదకి ప్రశ్నల మీద ప్రశ్నలు వదులుతూ సమాధానాలు కనుక్కోండి చూద్దాం అన్నట్టు ఉండే కథనం సాగుతూ పోయింది.  కానీ..కొన్ని వర్గాల ప్రేక్షకులకు మాత్రమే ఇది నచ్చుతుంది. బి, సి తరగతుల ఆడియన్సుకు పెద్దగా నచ్చదనే చెప్పాలి.

ఇక సెకండాఫ్లో చిక్కుముడులన్నీ సవివరంగా విప్పుకుంటూ వచ్చినా.. క్లైమాక్స్ అద్భుతంగా ఉన్నా థియేటర్లోంచి బయటికి వచ్చేప్పుడు కొన్ని సన్నివేశాలకు మాత్రం సమాధానం వెతుక్కోవాల్సి వచ్చింది. దీంతో కాస్త నిరుత్సాహాన్ని, అసహనాన్ని ప్రేక్షకులకు కలిగిస్తుంది. ఇక చూసిన చిత్రం గురించి ప్రేక్షకుడు ఎక్కువగా ఆలోచిస్తే ఆ సినిమా సక్సెస్ అయినట్టే అనే ధర్మాన్ని అనుసరించి ఈ సినిమా విజయవంతం అయినట్టే.. కానీ ఆ ఆలోచన మెచ్చుకోలుతనంగా, ఆశ్చర్యకరంగా ఉండాలి కానీ అనుమానాస్పదంగా, కాస్త తికమకగా ఉంటే ఆ విజయానికి కొంచెంలో కొంచెం మసక పడ్డట్టే. ఈ సినిమా విషయంలో సరిగ్గా అదే జరిగింది.

సాంకేతిక విభాగం :

ఒక క్రైమ్ కథకు థ్రిల్లింగా ఉండే అల్లికలాంటి తెలివైన కథానాన్ని జోడించి ఆద్యంతం ఆసక్తికరంగా ఉండేలా పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ ను రాసుకోవడంలో, దాన్ని అలాగే తెరకెక్కించడంలో కార్తిక్ నరేన్ ఒక దర్శకుడిగా, రచయితగా సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇక సినిమా నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ, జెక్స్ బిజోయ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉండి సినిమాకు నూటికి నూరు శాతం సహాయపడ్డాయి.

క్లిష్టమైన ఈ చిత్ర కథనానికి శ్రీజిత్ సారంగ్ ఎడిటింగ్ చాలా బాగా దోహదపడింది. శివరాం ప్రసాద్ గోగినేని అందించిన తెలుగు మాటలు, పాత్రల డబ్బింగ్ వాయిస్ చాలా పర్ఫెక్ట్ గా కుదిరాయి. ఇక రెహమాన్‌ని ఈ తరహా సీరియస్‌ పాత్రలో చూడ్డం కొత్త. మరెవరైనా అయితే రొటీన్‌గా అనిపించేదేమో.

తీర్పు:

కార్తికి నరేన్ డైరెక్ట్ చేసిన ఈ ’16 – ఎవ్వెరీ డీటెయిల్ కౌంట్స్‌’ చిత్రం ఆద్యంతం ఆకట్టుకునే క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. కార్తిక్ నరేన్ రూపొందించిన మంచి కథ, అద్భుతమైన కథనం, రహమాన్ గొప్ప నటన, సరైన క్లైమాక్స్ ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ కాగా ఫస్టాఫ్ బాగానే ఉన్నా అందులో దర్శకుడు ఉద్దేశపూర్వకంగానే ప్రేక్షకుడిని తికమక పెడుతున్నట్టు ఉండటం, ఎంతో సేపు ఆలోచిస్తే గాని అందుకోలేని అంశాలు కొన్ని ఉండటం ఇందులో కాస్త ఇబ్బంది కలిగించే అంశాలు. మొత్తం మీద ఈ చిత్రం క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్స్, ఇన్వెస్టిగేటివ్ సినిమాలను ఇష్టపడే వాళ్ళకు చాలా బాగా నచ్చుతుందనే చెప్పొచ్చు.

విడుదల తేదీ:10/03/2017
రేటింగ్: 3/5
నటీనటులు: రహమాన్, ప్రకాష్‌ విజయ రాఘవన్‌.. ప్రదీప్‌.. సంతోష్‌ కృష్ణ.. ప్రవీణ్‌ తదితరులు
సంగీతం: జెక్స్ బిజోయ్
నిర్మాత: చదలవాడ పద్మావతి
దర్శకత్వం: కార్తిక్ నరేన్

- Advertisement -