వైభవంగా శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు..

132
- Advertisement -

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలలో వెలేరు మండలం ఉప్పరపల్లి గ్రామం నుండి వచ్చిన మేకపోతుల బండి అందరినీ ఆకట్టుకుంది. మేకపోతుల బండి ఎదుట యువకులు సెల్ఫీలు దిగుతూ నృత్యాలు చేశారు. ప్రతి సంవత్సరం వేలేరు మండలం ఉప్పరపల్లి గ్రామం నుండి మేకపోతు బండ్లను తీసుకువస్తామని తమ మేకల గొర్రెల మందలను చల్లగా చూడాలని కోరుతూ తమ పూర్వీకులు శ్రీ కొత్త కొండ వీరభద్ర స్వామి ఆలయానికి తీసుకు వచ్చే వారని.. అదే సాంప్రదాయాన్ని తాము కొనసాగిస్తున్నామన్నారు. వీరభద్ర స్వామివారి దయవల్ల తమకు తమ కుటుంబాలకు మంచి జరుగుతూ తమ మందలు కూడా సురక్షితంగా ఉంటాయని మేకపోతుల బండ్ల నిర్వాహకులు తెలిపారు.

అదేవిదంగా ​భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామం నుండి గ్రామస్తులు 58 ఎడ్లబండ్లను పువ్వులతో విద్యుద్దీపాలతో చక్కగా అలంకరించుకొని ఊరేగింపుగా వీరభద్ర స్వామి దేవాలయానికి బయలుదేరారు. సనాతనం నుండి ఎడ్ల బండ్లను తమ గ్రామం నుండి వీరభద్ర స్వామి దేవాలయానికి ప్రదర్శనగా తీసుకు వెళ్లడం జరుగుతుందని తమ పాడి పంటలను కుటుంబాలను చల్లగా చూడాలని కోరుతూ ఎడ్లబండ్లతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటామని గ్రామస్తులు తెలిపారు. అర్ధరాత్రి వేళ ఆలయానికి చేరుకున్న ఎడ్లబండ్లు భక్తుల సందడి మధ్య ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశాయి. ఎడ్లబండ్ల ప్రదక్షణాలు భక్తులను చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

- Advertisement -