తన కెరీర్‌లో ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలను పోషించి, తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకున్న స్టార్ హీరో విక్టరీ వెంకటేష్. చాలా కాలం గ్యాప్ తర్వాత వెంకీ నటిస్తున్న చిత్రం గురు. ఈ సినిమాలో బాక్సింగ్ కోచ్‌గా వెంకటేష్ కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, ఫస్ట్ లుక్‌తో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. సుధా కొంగర తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్నా కొన్ని కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఏప్రిల్ 7వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఇక ఈ చిత్రంలోని “ఏయ్ సక్కనోడా” పాట లిరికల్ వీడియోను ఈ నెల 17న విడుదల చేస్తున్నట్లు నిర్మాత శశికాంత్ తెలిపారు. సుప్రసిద్ధ దర్శకులు మణిరత్నంతో పని చేసి, మిత్ర్ సినిమాతో నేషనల్ అవార్డు దక్కించుకున్న సుధా కొంగర ఈ చిత్రాన్ని మలచిన తీరు అద్భుతమని .. వెంకటేష్‌ను సరికొత్త లుక్‌లో ప్రజెంట్ చేస్తున్నామని తెలిపారు. వెంకీతో పాటు రితిక సింగ్, ముంతాజ్ సర్కార్‌లు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు.
వెంకటేశ్ బాక్సింగ్ కోచ్ గా నటించిన ఈ సినిమాలో, ఆయన శిష్యురాలిగా రితికా సింగ్ కనిపించనుంది. ఇది తన కెరియర్ లో చెప్పుకోదగిన సినిమా అవుతుందనే నమ్మకంతో వెంకటేశ్ వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.