అన్ని రంగాల్లో ఉత్తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించి దేశంలోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ కనబర్చిన మూడు పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణకు చోటు దక్కడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్న కేంద్ర నీతి ఆయోగ్ సోమవారం తాజాగా ప్రకటించిన తన నివేదికలో తెలంగాణ రాష్ట్ర ప్రతిభను కొనియాడింది.
దేశంలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ప్రదర్శించిన మూడు పెద్ద రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు, తెలంగాణ వరుస మూడు స్థానాల్లో నిలిచాయని వినోద్ కుమార్ పేర్కొన్నారు. ప్రణాళికాబద్దంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన పని తీరు వల్లే తెలంగాణ దేశంలో అగ్రగామిగా నిలిచిందని వినోద్ కుమార్ తెలిపారు. రానున్న రోజుల్లో దేశంలో మొదటి స్థానంలో నిలిచేందుకు అంకిత భావంతో కృషి చేస్తామని వినోద్ కుమార్ అన్నారు. దేశంలో అగ్రభాగాన నిలిచిన మూడు రాష్ట్రాలు కూడా ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల నాయకత్వంలోని ప్రభుత్వాలే కావడం గొప్ప విషయం అని వినోద్ కుమార్ వివరించారు.