సిద్ధిపేట వ్యవసాయ మార్కెట్‌లో విత్తన ధ్రువీకరణ సంస్థ కొత్త భవనం, గోదాములకు ఈ రోజు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్, జెడ్పీ ఛైర్మన్ రోజా శర్మ, మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాల సాయిరాం, వ్యవసాయ శాఖ అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఏ ప్రభుత్వాలైనా ప్రజల కోసమే పని చేయాలని అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతులను రోడ్డు మీద పడేసిందని విమర్శించారు. రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల కోసం మంత్రులు ఢిల్లీకి వెళ్తే… ఢిల్లీ పెద్దలు అవమానించారని మండిపడ్డారు.కేంద్ర ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని వ్యాఖ్యలు చేశారు.
ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్మాలని గతంలో కేంద్రం చెప్పిందని… ఇప్పుడు దిగుబడి ఎక్కువ వచ్చేసరికి వద్దంటున్నారని మంత్రి విమర్శించారు. ఇలాంటప్పుడు పంట పండించిన రైతులు ఎక్కడకు వెళ్లాలని ప్రశ్నించారు. పామ్ ఆయిల్ పంటతో ఎక్కువ లాభాలు ఉన్నాయని… రైతులు ఈ పంటను అందిపుచ్చుకోవాలని అన్నారు. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతుల దృష్టి సారించాలని సూచించారు.