సికింద్రాబాద్ లోని మహంకాళి అమ్మవారి దర్శనం కోసం ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో మహంకాళి అమ్మవారి ఆలయ అభివృద్ధి, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, రీజనల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణ, ఆలయ ఈఓ మనోహర్ రెడ్డి, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మహేష్, కిషోర్, బాలాజీ శ్రీనివాస్ గౌడ్, కస్తూరి, ఆనంద్ పటేల్, చందు, కేఎం కృష్ణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎంతో చరిత్ర కలిగిన మహంకాళి అమ్మవారి ఆలయం ప్రభుత్వం, దాతలు, భక్తుల సహకారంతో ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు. ప్రతి ఏటా నిర్వహించే బోనాల ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు. మొక్కుల రూపంలో భక్తులు చెల్లించిన బంగారంతో అమ్మవారికి బంగారు బోనం చేయించిన విషయాన్ని గుర్తుచేశారు. అదేవిధంగా అమ్మవారి గర్బగుడికి మిగిలి ఉన్న వెండి తాపడం పనులు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. బోనాల ఉత్సవాల సందర్భంగా అమ్మవారి ఊరేగింపుకు ఒక రధాన్ని చేయించాలని, అమ్మవారికి బంగారు చీరను చేయించాలని సమావేశంలో నిర్ణయించారు. ఆలయ అభివృద్దికి ఇంకా చేపట్టాల్సిన పనులు, భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా చేయాల్సిన ఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు.