టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈరోజు తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా న్యూమోనియాతో బాధపడుతున్న సిరివెన్నెల.. సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఆయన మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సతాపం తెలుపుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవీ ట్విట్టర్ ద్వారా విచారం వ్యక్తం చేశారు. సిరివెన్నెలతో ఆయకు ఉన్న అనుబంధాన్ని, అనుభవాల్ని తెలుపుతూ సుధీర్ఘంగా ఓ లేఖను పోస్ట్ చేశారు.
‘‘సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు ఆరు రోజుల క్రితం హాస్పిటల్‌లో జాయిన్ అవ్వడానికి వెళుతున్న సమయంలో నేను ఆయనతో మాట్లాడాను. తన ఆరోగ్యం బాగుండలేదని తెలిసి, మద్రాసులో ఒక మంచి హాస్పిటల్ ఉందని, ఇద్దరం వెళదాం.. అక్కడ జాయిన్ అవుదురు గానీ అని అన్నాను. ఆయన మిత్రమా ఈ రోజు ఇక్కడ జాయిన్ అవుతాను.. నెలాఖరులోపు వచ్చేస్తాను. నువ్వు అన్నట్టుగానే అప్పటికి ఉపశమనం రాకపోతే, ఖచ్చితంగా మనిద్దరం కలిసి అక్కడికి వెళ్దాం అన్నారు.
అలా వచ్చేస్తానని వెళ్లిన మనిషి ఈ విధంగా జీవం లేకుండా వస్తారు అనేది ఊహించలేకపోయాను. చాలా బాధాకరమైన విషయం ఇది. ఆయనకు అన్ని రకాల మెరుగైన వైద్యం, అందివ్వాలనే ఉద్దేశ్యంతో ఆ రోజు ఆయనకు ఫోన్ చేస్తే ఎంతో హుషారుగా మాట్లాడారు. అంత ఉత్సాహంగా దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడితే ఖచ్చితంగా ఏమీ జరగదు అని నేను అనుకున్నాను. ఆ సమయంలో వారి కుమార్తెతో కూడా మాట్లాడాను. మీతో మాట్లాడాక నాన్నగారు చాలా ఉత్సాహంగా ఉన్నారని ఆమె వెల్లడించారు. నన్ను సీతారామశాస్త్రిగారి కుటుంబంలో వాళ్లు ఎంతగా అభిమానిస్తారో అనే విషయాన్ని కూడా ఆమె వెల్లడించారు. ఇద్దరూ ఒకటే వయసు వాళ్లం కావడంతో ఎప్పుడూ ఆయన ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉండేవారు. ఎప్పుడు కలిసినా చాలా ఆప్యాయంగా మిత్రమా అంటూ పలకరిస్తూ మాట్లాడతారు.
తెలుగు సినీ కళామతల్లికి ఎనలేని సేవలు అందించారు. వేటూరిగారి తర్వాత అంత గొప్ప సాహిత్య విలువలను ఈ తరానికి అందించిన గొప్ప రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఆయన భాషను అర్థం చేసుకోవడానికి కూడా మనకున్న పరిజ్ఞానం సరిపోదు.. అంతటి మేధావి ఆయన. ఎన్నో అవార్డులు, రివార్డులు తన కెరియర్లో అందుకున్న ఆయనకు 2019లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని అందివ్వగా.. ఆ రోజున నేను వ్యక్తిగతంగా ఆయన ఇంట్లో చాలా సేపు గడిపాను. సిరివెన్నెల సీతారామశాస్త్రి లాంటి వ్యక్తిని కోల్పోతే సొంత బంధువుని కోల్పోయినట్లుగా చాలా దగ్గరి ఆత్మీయుడిని కోల్పోయినట్టే అనిపిస్తోంది. గుండె తరుక్కుపోతోంది, గుండెంతా బరువెక్కి పోతోంది. తెలుగు సినీ పరిశ్రమలో ఆయన స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరు. ఎంతో మందిని శోక సముద్రంలో ముంచి దూరమైపోయిన ఆయన నిజంగా మనందరికీ, ఈ సాహత్య లోకమంతటికి అన్యాయం చేశారు. ముఖ్యంగా మా లాంటి మిత్రులకు అన్యాయం చేసి వెళ్లిపోయారు.
ముఖ్యంగా నాకు అత్యంత ఇష్టమైన రుద్రవీణ సినిమాలోని ‘తరలిరాద తనే వసంతం, తన దరికిరాని వనాల కోసం’ అనే పాటలోలాగా ఆయనే మన అందరినీ వదిలి తరలి వెళ్ళిపోయారు. ఎస్పీ బాలసుబ్రమణ్యంగారు కానీ, సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు కానీ ఇలా అర్థాంతరంగా వెళ్లిపోవడం చిత్ర పరిశ్రమకు ఎవరూ పూరించలేని లోటు. కానీ తన పాటలతో ఇంకా ఆయన బతికే ఉన్నారు. తన పాట బతికున్నంతకాలం సిరివెన్నెల సీతారామశాస్త్రి కూడా బతికే ఉంటారు.
ఆయన సాహిత్యంలో శ్రీశ్రీగారి పదును కనపడుతుంది. ఈ సమాజాన్ని మేలుకొలిపే విధంగా ఒక శక్తి ఉంటుంది. ఈ సమాజంలో తప్పు ఎత్తి చూపే విధంగా ఆయన సాహిత్యం ఉంటుంది. ఈ సమాజానికి పట్టిన కుళ్ళు కడిగిపారేసే విధంగా ఉంటుంది. అంత పవర్ ఆయన సాహిత్యంలోనే కాదు ఆయన మాటల్లోనే కాదు, ఆయన కలంలోనే కాదు, ఆయన మనస్తత్వం కూడా దాదాపు అలాగే ఉంటుంది. అలాంటి గొప్ప వ్యక్తి, గొప్ప కవి మళ్లీ మనకు తారసపడటం కష్టమే. ఆయన ఆ తల్లి సరస్వతీ దేవి వడిలో సేద తీరుతున్నట్లుగా అనిపిస్తుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను..’’ అని చిరంజీవి పేర్కొన్నారు.