దేశాన్ని బీజేపీ నేతలు రావణ కాష్టంగా మారుస్తున్నారని మండిపడ్డారు సీఎం కేసీఆర్. దేశంలో పేదరికాన్ని పెంచడం, 750 మంది రైతులను పొట్టన పెట్టుకోవడమే వీళ్లు దేశానికి చేసిన పని అన్నారు. కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం…బీజేపీ వాళ్లను ఇలాగే వదిలేస్తే దేశానికి మతపిచ్చి లేపి.. విభజన రాజకీయాలు తెస్తారని దుయ్యబట్టారు.
ప్రపంచంలో అనేక దేశాల, అనేక సమాజాల, అనేక మతాల ప్రజలు ఇండియాలో కలిసి బతుకుతున్నారని, బీజేపీ పాలకులు ఆ సామరస్యాన్ని పూర్తిగా చెడగొడుతున్నారని విమర్శలు గుప్పించారు. తెలంగాణలోని సామరస్య వాతావరణాన్ని, ఆర్థిక వ్యవస్థను తమ రాజకీయాలకోసం ధ్వంసం చేయడాన్ని అంగీకరించడానికి ఇక్కడ ఉన్నామా? ఇదా ఈ దేశానికి కావాల్సింది? ఆలోచించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
యాసంగిలో కూడా రైతుబంధు ఇస్తామని, రైతులు బేఫికర్‌గా ఉండాలని చెప్పారు. రైతులకు కరెంటు, నీళ్లు, పెట్టుబడి, మంచి విత్తనాలు అందిస్తున్నామని, ఇండియా మొత్తంలో నకిలీ విత్తనాల మీద పీడీ యాక్ట్ తీసుకవచ్చినది తెలంగాణ ప్రభుత్వం ఒక్కటేనని గుర్తుచేశారు. ఏడేండ్ల కింద తెలంగాణ పల్లెల్లో ఎంత డబ్బు ఉండె, ఇవాళ ఎంత డబ్బు ఉన్నది? ఇవన్నీ నిజాలు కాదా?’ అని ప్రశ్నించారు.