రైతు ధర్నా వేదికగా బీజేపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి. బద్మాష్ మాటలతో రైతుల జీవితాలతో ఆటాడుకోవద్దని…బాధ్యత మరచి బేవకూఫ్ మాటలు మాట్లాడవద్దని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వామినాథన్ కమిషన్ నివేదికను ఆమోదించింది కానీ అమలు చేయడానికి ముందుకు రావడం లేదు. రైతాంగాన్ని ఆదుకోవడానికి ముందుకు రావడం లేదు. ఆహార భద్రత అనేది కేంద్రం బాధ్యత. ప్రతి సంవత్సరం రైతుకు కనీసన మద్దతు ధర కల్పించే బాధ్యత కేంద్రానిదని గుర్తుచేశారు.
కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకునేందుకు పెద్ద ఎత్తున ప్రాజెక్టులకు నిదులు కేటాయించి, వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించారని తెలిపారు. రైతుబంధు ఇచ్చి, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించి వ్యవసాయాన్ని పండుగ చేశారన్నారు.
తెలంగాణలో పంటల దిగుబడి వస్తుంటే.. రాష్ట్రాన్ని అభినందించాల్సింది పోయి, కేంద్రం రైతు వ్యతిరేక చర్యలను తీసుకుంటున్నారు. కేంద్రం తన బాధ్యతలను విస్మరించి రాష్ట్రాలపై నెట్టేస్తోందని దుయ్యబట్టారు.