టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తెచ్చేస్తానని పగటి కలలు కంటున్నాడు..కాని క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కాంగ్రెస్ అంటేనే వర్గ విబేధాలకు, ముఠా తగాదాలకు, నేతల కుమ్ములాటలకు మారుపేరు. ఆ జిల్లా, ఈ జిల్లా అని కాదు..ప్రతి నియోజకవర్గంలో ఇదే పరిస్థితి. తాజాగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ కాంగ్రెస్‌లో నేతల మధ‌్య నెలకొన్న కుమ్ములాటలు రేవంత్‌కు తలనొప్పిగా మారాయి. రామచంద్రనాయక్, నెహ్రూనాయక్ వర్గాల మధ్య విబేధాలతో డోర్నకల్ కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. రామచంద్రు నాయక్ స్థానికేతరుడని, ఎన్నికల సమయాల్లో తప్పా..నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడని నెహ్రూనాయక్ వర్గం ఆరోపిస్తోంది. మరోవైపు రామచంద్రు నాయక్ పనితనం, నిబద్దత, జనబలం చూపే డోర్నకల్ కాంగ్రెస్ ఇంచార్జిగా అధిష్టానం నియమించిందని ఆయన వర్గం అంటోంది. 40 ఏళ్లుగా టీఆర్ఎస్ నేత రెడ్యానాయక్‌కు కంచుకోటగా ఉన్న డోర్నకల్‌లో కాంగ్రెస్ సరైన నాయకుడిని ఎంచుకోకపోతే వచ్చే ఎన్నికల్లో కూడా పరాజయం తప్పదని స్థానికంగా చర్చ జరుగుతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రామచంద్రనాయక్ తొలుత గట్టిపోటీ ఇచ్చినా, చివరి నిమిషంలో గెలుపును లైట్ తీసుకోవడంతో రెడ్యానాయక్ స్వల్ఫ మెజారిటీతో గెలిచారని నెహ్రూనాయక్ వర్గం ఆరోపిస్తోంది.
ఒక వేళ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నట్లుగా తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరిగితే డోర్నకల్‌లో కాంగ్రెస్ మరోసారి ఓడిపోవడం ఖాయమని ఆ పార్టీ నాయకులే అంగీకరిస్తున్నారు. డోర్నకల్ కాంగ్రెస్‌లో తారాస్థాయికి చేరుకున్న వర్గ పోరు ఇప్పుడు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో మరిపెడలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు భరత్ చంద్రారెడ్డి, మాజీ ఎంపీ బలరాం నాయక్ సమక్షంలో రామచంద్రునాయక్, నెహ్రూనాయక్ వర్గాలు కొట్టుకున్నంత పని చేసాయి. ఆ సమయంలో ఇరు వర్గాలకు సర్దిచెప్పలేక పార్టీ నాయకులు తలలు పట్టుకున్నారు. ఇటీవల నియోజకవర్గంలోని ఆరు మండలాలకు కొత్త అధ్యక్షులను రామచంద్రునాయక్ నియమించడంతో విబేధాలు మరింత భగ్గుమన్నాయి. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే నూతన ఇంచార్జిలను నియమించినట్లు రామచంద్రునాయక్ చెప్పుకొచ్చారు. కాగా ఈ నియామకాల విషయంలో రామచంద్రనాయక్‌పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్‌కు నెహ్రూనాయక్ వర్గం ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం డోర్నకల్ కాంగ్రెస్‌కు ప్రధాన కేంద్రంగా ఉన్న మరిపెడలో కాంగ్రెస్ రెండు పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేయడం చూసి..ఇదేం విడ్డూరమని ప్రజలు విస్తుపోతున్నరు. గత ఎన్నికల్లో రెడ్యానాయక్‌కు గట్టిపోటీ ఇచ్చిన తనకే మళ్లీ టికెట్ వస్తుందని రామచంద్రనాయక్ ధీమాగా ఉన్నారు. మరోవైపు స్థానికుడైన నెహ్రూనాయక్ నియోజకవర్గంలో రామచంద్రునాయక్‌పై ఉన్న వ్యతిరేకతను ఆసరాగా చేసుకుని సీటు సాధిస్తానని కాన్ఫిడెంట్‌గా ఉన్నారంట..మొత్తంగా డోర్నకల్ కాంగ్రెస్ నేతల మధ్య వర్గ విబేధాలను ఎలా చల్లార్చాలో తెలియక రేవంత్ రెడ్డి తలపట్టుకున్నాడని గాంధీభవన్‌లో చర్చ జరుగుతోంది.