అచ్చేదిన్ కాదు సచ్చేదిన్.. దేశాన్ని సర్వనాశనం చేశారు..!

79
mamatha
- Advertisement -

ఆట మొదలైందంటూ ఒంటి కాలితో మోదీ, అమిత్‌షాలను బెంబెలెత్తించి, టీఎంసీని మూడో సారి అధికారంలోకి తీసుకువచ్చిన బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఇప్పుడు హస్తినపై కన్నేసింది. దేశవ్యాప్తంగా బీజేపీయేతర పార్టీలను ఏకం చేసి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మోదీని పీఎం కుర్చీని దింపాలని మమతాదీదీ పంతం పట్టింది. ఈమేరకు మరో రెండు, మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గోవాలో పాగా వేసేందుకు దీదీ రంగంలోకి దిగింది. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల స‌న్న‌ద్ధ‌త కోసం గోవాలో మ‌కాం వేసిన మ‌మ‌తాబెన‌ర్జీ . గోవా ఫార్వ‌ర్డ్ పార్టీ అధ్య‌క్షుడు విజ‌య్ స‌ర్దేశాయ్‌తో భేటీ అయ్యారు. రాబోయే గోవా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తృణ‌మూల్ కాంగ్రెస్‌, గోవా ఫార్వ‌ర్డ్ పార్టీ, ఇంకా ఇత‌ర చిన్నాచిత‌కా పార్టీలు క‌లిసి పోటీచేసే అంశంపై ఈ స‌మావేశంలో చ‌ర్చించారు.

అనంత‌రం మీడియాతో మాట్లాడిన మ‌మ‌తాబెన‌ర్జీ కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. అచ్చేదిన్ అచ్చేదిన్ అంటూనే దేశాన్ని స‌ర్వ‌నాశ‌నం చేశార‌ని మండిప‌డ్డారు.దేశంలో ద్ర‌వ్యోల్బ‌ణం అంత‌కంత‌కూ పెరిగిపోతోంది. గ్యాస్ సిలిండర్ ధ‌ర‌లు, పెట్రోల్ డీజిల్ ధ‌ర‌ల పెంపున‌కు అస‌లు అడ్డుక‌ట్టేలేదు. జీఎస్టీ కార‌ణంగా దాదాపు అన్ని ర‌కాల వ్యాపారాలు దెబ్బ‌తిన్నాయి. ఎగుమ‌తులు పూర్తిగా త‌గ్గిపోయాయి. అయినా అధికార బీజేపీకి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కారించాల‌న్న సోయి లేదు. పైగా, వాళ్లు ఇంకా అచ్చేదిన్ రానున్నాయ‌ని చెబుతున్నారు. కానీ దేశం ఇప్ప‌టికే స‌ర్వ‌నాశనం అయిపోయింది అంటూ దీదీ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. బీజేపీయేత‌ర శ‌క్తుల‌న్నింటిని ఏక‌తాటిపైకి తెచ్చి ఆ పార్టీని అంత‌టా ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా తాము పోరాడుతామ‌ని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు గోవా ఫార్వ‌ర్డ్ బ్లాక్ పార్టీ అధ్య‌క్షుడు విజ‌య్ స‌ర్దేశాయ్‌తో క‌లిసి పోటీచేసే విష‌యంపై మాట్లాడానని అన్నారు. అయితే ఏ నిర్ణ‌యం తీసుకుంటాడ‌నేది ఆయ‌న ఇష్ట‌మ‌ని చెప్పారు. బీజేపీ వ్య‌తిరేక ఓటు చీలి పోకూడ‌ద‌నేది త‌న ఉద్దేశ‌మ‌న్నారు. కాగా, విజ‌య్ స‌ర్దేశాయ్ కూడా మ‌మ‌త‌పై ప్ర‌శంస‌లు కురిపంచారు.

పార్టీలో చ‌ర్చించి పొత్తు విష‌యంలో నిర్ణ‌యం తీసుకుంటాన‌న్నారు. మొత్తంగా అచ్చేదిన్ కాదు సచ్చేదిన్..దేశాన్ని సర్వనాశనం చేశారంటూ మమతా దీదీ మోదీపై చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. మోదీ సారథ‌్యంలోని బీజేపీని ఎదుర్కోవడం కాంగ్రెస్‌కు సాధ్యం కావడం లేదని, అందుకే టీఎంసీని జాతీయ పార్టీగా విస్తరించాలని దీదీ బెంగాల్ నుంచి గోవాకు వచ్చారని తెలుస్తోంది. అలాగే దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీయేతర పార్టీలైన డీఎంకే, టీఆర్ఎస్, వైసీపీలతో పొత్తు పెట్టుకుని మోదీని దించేందుకు దీదీ ప్రయత్నాలు మొదలుపెట్టిందని జాతీయ మీడియాలో చర్చ జరుగుతోంది. మొత్తంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతాబెనర్జీ వేస్తున్న స్కెచ్ కాషాయనేతలను కలవరపెడుతుందనే చెప్పాలి.

- Advertisement -