మోహన్ బాబు దారుణంగా బూతులు తిట్టారు- హీరో తనీశ్

238
- Advertisement -

టాలీవుడ్‌లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నికల వ్యవహారం సంచలనంగా మరిన విషయం తెలిసిందే. ఈ ఎన్నిక‌లు ఎంత ర‌చ్చ‌గా మారాయో మ‌నం చూశాం. అయితే ఎన్నిక‌లు ముగిసాయి, సమసిపోతుందిలే అనుకున్న స‌మ‌యంలో ప్ర‌కాశ్ రాజ్ ప్యానెల్ షాకిచ్చారు. ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన 11 మంది సభ్యులు ‘మా’కు రాజీనామా చేశారు. ఆయనకు మద్దతుగా కొందరు సినీ పెద్దలు కూడా ఉన్నారు. విష్ణుకి ఇబ్బందులు ఉండకూడదనే తమ మెంబర్స్ రాజీనామా చేసినట్లు ప్రకాశ్ రాజ్ తెలిపారు.

ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం ప్రకాశ్ రాజ్ తన ప్యానెల్ సభ్యులతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న యువ నటుడు తనీశ్ మాట్లాడుతూ.. తీవ్ర బాధకు లోనయ్యారు. పోలింగ్ సందర్భంగా మోహన్ బాబు తనను దారుణంగా తిట్టారని ఆరోపించారు. తనకు తల్లే అన్నీ అని, అలాంటి అమ్మను కించపరిచేలా మోహన్ బాబు తిట్టారని వెల్లడించారు. ఆ సమయంలో ఎంతో బాధ కలిగిందని అన్నారు. మధ్యలో వచ్చిన బెనర్జీని కూడా మోహన్ బాబు భయంకరంగా తిట్టారని తెలిపారు. అయితే తాము తీవ్రంగా ప్రతిస్పందించకుండా మంచు విష్ణు నిలువరించాడని తనీశ్ పేర్కొన్నాడు.

తాను ఇలా ఏ రోజూ మీడియా ముందుకు వచ్చింది లేదని, వివాదాలకు తాను దూరమని స్పష్టం చేశారు. ఇవాళ తాను మా ఈసీ మెంబర్ పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, తనకు ఓటేసిన వారందరికీ క్షమాపణలు చెబుతున్నానని తనీశ్ వెల్లడించారు. ఇక నా వల్ల బెనర్జీ కూడా మాటలు పడ్డారని, ఆయనకు క్షమాపణలు తెలుపుతున్నానని వివరించారు. మంచు విష్ణు, మనోజ్ తనకు ఎంతో కావాల్సిన వారని, కానీ ప్రకాశ్ రాజ్ ఆలోచనలు నచ్చడం వల్లే ఆయన ప్యానెల్ నుంచి పోటీ చేశానని స్పష్టం చేశారు.

- Advertisement -