వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దేశద్రోహం కేసులో బుక్కైంది కన్నడ నటి, కాంగ్రెస్ లీడర్ రమ్య. పాకిస్థాన్ నరకం ఏమీ కాదంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై కూర్గ్‌కు చెందిన అడ్వొకేట్ విఠల్ గౌడ కోర్టుకెక్కారు. సోమ్‌వార్‌పేట కోర్టులో సీఆర్పీసీ సెక్షన్ 200 కింద ఆయన ఓ ప్రైవేటు ఫిర్యాదును దాఖలు చేశారు. పాకిస్థాన్‌ను పొగుడుతూ భారతీయులను రెచ్చగొట్టేలా చేశారని ఆయన ఆరోపించారు. ఆమెపై ఐపీసీ సెక్షన్ 124ఎ కింద దేశద్రోహం కేసు నమోదు చేయాలని ఆయన కోర్టును కోరారు.
ఇటీవల పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన సార్క్ కార్యక్రమానికి హాజరైన రమ్య.. భారత్ చేరుకున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కొందరు అన్నట్టు పాకిస్థాన్ ఏమీ నరకం కాదని.. అక్కడి ప్రజలు తమను ఎంతో బాగా చూసుకున్నారంటూ ప్రశంసించింది. దీనిపై సీరియస్ అయిన కొందరు ఏబీవీపీ విద్యార్థి నేతలు.. లాయర్లు ఆమెకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. పాకిస్థాన్ ను పొగిడి నోబెల్ బహుమతికి అర్హురాలైందని విమర్శించారు. త్వరలో క్లింటన్ సరసన చేరుతుందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రమ్యపై నమోదైన కేసు శనివారం విచారణకు రానుంది.
అయితే తానేమీ తప్పు చేయలేదని, క్షమాపణ అడగాల్సిన అవసరం లేదని రమ్య మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో చెప్పింది.
కన్నడంతో పాటు పలు భాషల్లో నటించిన రమ్య.. 2011లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల పాక్, భారత్ మధ్య విభేదాల నేపథ్యంలో కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్.. ఆ దేశాన్ని నరకంతో పోల్చిన విషయం తెలిసిందే. ఇస్లామాబాద్‌లో జరిగిన సార్క్ దేశాల సమావేశానికి హాజరైన హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కూడా పాక్ వైఖరిని ఖండించారు.