‘మహా’ ఒప్పందం

203
K Chandrasekhar Rao, Devendra Fadnavis to sign pact on projects today
K Chandrasekhar Rao, Devendra Fadnavis to sign pact on projects today
- Advertisement -

కాళేశ్వరానికి అడ్డంకులు తొలగిపోనున్నాయి. గోదావరి నదిపై సర్కార్ రీడిజైన్ చేసిన ప్రాజెక్టుల నిర్మాణానికి లైన్ క్లియర్ కాబోతోంది. మహారాష్ట్రతో కీలక ఒప్పందాలు చేసుకునేందుకు రెడీ అయ్యారు సీఎం కేసీఆర్. ఇవాళ ఉదయం స్పెషల్ ఫ్లైట్ లో సీఎం కేసీఆర్‌ ముంబై వెళ్లారు. ఆయన వెంట మంత్రివర్గ సభ్యులు, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు మహారాష్ట్ర వెళ్లనున్నారు. ముంబై సహ్యాద్రి గెస్ట్ హౌస్ వేదికగా జరగనున్న సమావేశంలో.. ప్రాజెక్టులపై అగ్రిమెంట్లు చేసుకోనున్నాయి రెండు రాష్ట్రాలు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాజెక్టులు, వాటి వివాదాలపై సీఎం కేసీఆర్‌ దృష్టిసారించారు. ఆదిలాబాద్ జిల్లాలో పెన్‌గంగ బ్యారేజీ, ప్రాణహిత నదిపై తుమ్మిడిహట్టి బ్యారేజీ, నిజామాబాద్ జిల్లాలో నత్తనడక నడుస్తున్న లెండి ప్రాజెక్టులపై కేసీఆర్ జులై 2014లో ముంబై వెళ్ళి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో చర్చలు జరిపారు. ఆ తర్వాత నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు ముంబై, నాగపూర్ వెళ్ళి ఆ రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి గిరీశ్ మహాజన్‌తో పలుమార్లు చర్చించారు.
తమ్మిడిహట్టి, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో ముంపు ప్రాంతాలు, ఎత్తు విషయంలో రాష్ట్ర ఇరిగేషన్ శాఖాధికారులు రూపొందించిన డిజైన్లకు.. మహారాష్ట్ర అధికారులు అంగీకరించారు. దీంతో అక్కడి సర్కారు కూడా ఇందుకు అభ్యతరం చెప్పలేదు. గతంలోనే మహా సీఎం ఫడ్నవీస్ తో విస్తృతంగా చర్చించారు సీఎం కేసీఆర్. ఇపుడు తుది అగ్రిమెంట్లు కుదిరిన వెంటనే ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభం కానుంది.

చర్చల ఫలితంగానే..ప్రస్తుతం చనాక-కొరాటా బ్యారేజీ పనులు ప్రారంభమయ్యాయి. రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందంతో ఒక్క చనాక-కొరాట బ్యారేజీయే కాదు..ఆదిలాబాద్ జిల్లాలో 40 ఏళ్లుగా పెన్ గంగ నీటి కోసం ఎదురుచూస్తున్న ప్రజల చిరకాల వాంఛా నెరవేరనుంది. అలాగే ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉండిపొయిన తుమ్మిడిహట్టి, ప్రాణహిత, లెండి, మేడిగడ్డ బ్యారేజి సమస్యలన్నీ ఈ ఒప్పందం ద్వారా పరిష్కారం కానున్నాయి.

మహా ఒప్పందాన్ని ఒక సంబురంగా జరుపుకోవాలని భావిస్తోంది టీఆర్ఎస్. ఒప్పందం తర్వాత రేపు రాత్రి ముంబైలోనే ఉంటారు సీఎం కేసీఆర్. 24న మధ్యాహ్నం రెండు గంటలకు ముంబై నుంచి బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. ఎయిర్ పోర్ట్ లో సీఎంకు ఘనస్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు నేతలు. జిల్లాల నుంచి పెద్దఎత్తున రైతులను తరలించాలని నిర్ణయించారు. ఎయిర్ పోర్ట్ నుంచి క్యాంప్ ఆఫీస్ వరకు.. రైతులు, కళాకారులు, డప్పు చప్పుళ్లతో టీఆర్ఎస్ శ్రేణులు భారీ ఊరేగింపు నిర్వహించనున్నారు. స్వాగత ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యవేక్షిస్తున్నారు.

- Advertisement -