అమెరికాలోని కాన్సర్‌లో హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్‌ను ఆ దేశపౌరుడు జాతి వివక్షతో కాల్పులు జరిపి పొట్టనపెట్టుకున్న సంఘటన తెలిసిందే. కాల్పుల్లో మృతి చెందిన కూబిభొట్ల శ్రీనివాస్ అంత్యక్రియలు జూబ్లిహిల్స్ లోని మహా ప్రస్ధానంలో పూర్తయ్యాయి. శ్రీనివాస్‌ను కడసారి చూసేందుకు రాజకీయ నేతలతో పాటు బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శ్రీనివాస్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
కూచిభొట్ల శ్రీనివాస్ మృతదేహం సోమవారం రాత్రి 11.30 గంటల సమయంలో ఇంటికి చేరుకోవడంతో వాతావరణం ఒక్కసారిగా బరువెక్కింది. శ్రీనివాస్ కుటుంబసభ్యులు, స్నేహితులు, స్థానికులు విషాదవదనంతో విలపించారు. కుమారుడి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు వర్థిని, మధుసూదనరావు కుప్పకూలిపోయారు. పెద్ద కొడుకుని పొగొట్టుకుని తీరని శోకంలో మునిగిపోయామని …. తన చిన్న కుమారుడు తిరిగి అమెరికా వెళ్లనివ్వనని శ్రీనివాస్ తల్లి ఆవేదనతో తెలిపింది. తన లాంటి పరిస్ధితి ఇంకెవరికి రాకుడదని ఆమె చెప్పిన మాటలు అందరికి కంటతడి తెప్పించాయి.
విద్యార్థుల్లోని టాలెంట్‌ని వెలికి తీసి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే అమెరికా,దుబాయ్ లాంటి దేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని శ్రీనివాస్ తమ్ముడు సాయి తెలిపారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కంపెనీలపై ఆంక్షలు విధించి, కనీన వేతన చట్టాన్ని తీసుకొస్తే బాగుంటుందని ఇక్కడే మంచి జీతం వస్తే ఇతర ప్రాంతాలకు ఎందుకు వెళ్తామని ప్రశ్నించారు. అన్న అంత్యక్రియల్లో పాల్గొన్న సాయి ప్రభుత్వాలు ఆ విధంగా ఆలోచన చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు.
ట్రంప్ కొత్త పాలసీతో భారతీయులకు అమెరికాలో రక్షణ లేకుండా పోతోంది. మత, జాతి, వివక్ష, వలస జీవులపై వ్యతిరేకతతో విద్వేష పూరిత దాడులు జరుగుతున్నాయి. ఉద్యోగాలు కొల్లగొడుతున్నారంటూ.. వలస జీవులు వెళ్లిపోవాలంటూ దాడులు, కాల్పులకు పాల్పడుతుండడంతో అమెరికాలో భారతీయులు భయంభయంగా గడుపుతున్నారు. మరోవైపు ఇక్కడి వారు అమెరికా వెళ్లేందుకు నిరాసక్తి కనబరుస్తున్నారు.