ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం తర్వాత సుప్రసిద్ధ ఆలయాలన్నింటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు కేటాయిస్తూ… అభివృద్ధికి బాటలు వేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోమవారం మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గూడెం సత్యనారయణ స్వామి, గంగాపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులపై ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఇతర సభ్యులు బాలసాని లక్ష్మినారాయణ, ఎగ్గె మల్లేశం, ప్రభాకర్ రావు అడిగిన అనుబంధ ప్రశ్నలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమాధానం ఇచ్చారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నిత్యకైంకర్యాలకు 3,645 ఆలయాల్లో అర్చకులకు ధూప దీప నైవేద్య పథకం ద్వారా గౌరవ వేతనం, అర్చకులు, ఆలయ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, కామన్ గుడ్ ఫండ్ నిధుల ద్వారా పురాతన ఆలయాల జీర్ణోధారణ, నూతన ఆలయాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తున్నామని మంత్రి తెలిపారు.
రూ. 50 కోట్లతో బాసర ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని, ప్రస్తుతం రూ. 8.40 కోట్ల ప్రత్యేక అభివృద్ధి నిధులతో అతిధి గృహాలు, షెడ్స్, ప్రహారీ గోడ ఇతర ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. డిసెంబర్ 2021 నాటికి ఇప్పుడు కొనసాగుతున్న అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని, మిగిలిన పనులను డిసెంబర్ 2022 నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.
దక్షిణ అయోధ్య భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్దికి ప్రణాళికలు రూపోందిస్తున్నారని వెల్లడించారు. గోదావరి పుష్కరాల సమయంలో రూ. 30 లక్షలతో గూడెం సత్యనారయణ స్వామి వారి ఆలయంలో షెడ్స్, రోడ్ల నిర్మాణాలు, తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. రూ. 26 లక్షలతో ఇతర అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రూ. 50 లక్షల అంచనా వ్యయంతో గంగాపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మండపం, విమాన గోపుర నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు మంత్రి.