చెట్ల పండగ “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సరికొత్త పంథాలో ముందుకు సాగుతుంది. మంచి ఆశయానికి వెయ్యి మార్గాలు తోడు అన్నట్టుగా తెలంగాణ రాష్ట్ర వృక్షం, దసరాకు పూజించుకునే జమ్మి చెట్టును భాగం చేశారు నిర్వాహకులు. శమీ శమయతే పాపమ్ శమీ శత్రు వినాశినీ! అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ!! అని అందరి పెదాలపై పూజ వినిపిస్తున్న ఊళ్లలో మాత్రం జమ్మి చెట్టు కనిపించడం కష్టంగా మారింది. అందుకే “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో జమ్మిని భాగం చేశారు. గుడి గుడికి జమ్మి చెట్టును నాటే మహాసంకల్పాన్ని తీసుకున్నారు.
ఈ క్రమంలోనే, తెలంగాణ శాసన సభా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో భాగంగా అసెంబ్లీలో జమ్మి వృక్షాన్ని నాటారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ.. విజయానికి ప్రతీకగా భావించే జమ్మి చెట్టును నాటడం అద్భుతమైన అనుభూతిని కలిగించింది. త్రేతా యుగంలో రాముడికి నీడనిచ్చి, అరణ్యవాసంలో పాండవుల ఆయుధాలకు స్థావరంగా నిలిచిన జమ్మి చెట్టును మన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వృక్షంగా చేసింది. ఇంతటి చరిత్ర కలిగిన జమ్మి చెట్టు ప్రతీ ఊరిలో ఉండాలనే తలంపుతో ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారిని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. వారి కృషి, సంకల్పం వల్ల రాబోయే రోజుల్లో ప్రతీ ఊళ్లో జమ్మి చెట్లు అందుబాటులో ఉంటాయి. చరిత్ర ఉన్నంత కాలం, తెలంగాణలో దసరా జరిగినంత కాలం “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” నిలిచిపోయేలా వారు చేస్తున్న కృషికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అనంతరం గాంధీ జయంతి సందర్భంగా ఆ మహానుభావుడికి నాయకులందరు నివాళుర్పించారు.
ఈ కార్యక్రమంలో ప్రొటెం ఛైర్మన్ వి. భూపాల్ రెడ్డి, మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, బొగ్గారపు దయానంద్, కుర్మయ్యగారి నవీన్ కుమార్, వుల్లోల గంగాధర్ గౌడ్, అసెంబ్లీ సెక్రెటరీ నర్సింహ్మాచార్యులు, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.