‘లవ్ స్టోరి’ రివ్యూ..

507
Love Story
- Advertisement -

అక్కినేని హీరో నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’అనే సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం ఈరోజు థియేటర్స్‌లో విడుదలైంది. ‘ఫిదా’ తర్వాత శేఖర్ కమ్ముల రూపొందించిన ఈ చిత్రం అందమైన.. పాటలు ప్రోమోలతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తించింది. నిరీక్షణకు తెరదించుతూ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘లవ్ స్టోరి’ అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి.

కథ:

రేవంత్ (నాగ చైతన్య) తెలంగాణలోని ఆర్మూర్ కు చెందిన ఒక పేదింటి కుర్రాడు. తండ్రి చిన్నపుడే చనిపోతే కష్టపడి పెంచిన తల్లికి చేదోదు వాదోడుగా ఉంటూ పెరిగిన అతను.. పెద్దయ్యాక ఒక ఫిట్నెస్ డ్యాన్స్ స్కూల్ పెట్టి జీవితంలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తుంటాడు. అతడి ఊరికే చెందిన మౌనిక (సాయిపల్లవి) చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం కోసమని రేవంత్ ఉన్న చోటికే వస్తుంది. ఉద్యోగం సంపాదించలేక ఇబ్బంది పడుతున్న మౌనిక.. రేవంత్‌తో పరిచయం పెరిగి అతడి డ్యాన్స్ స్కూల్లోనే మాస్టర్‌గా చేరుతుంది. ఈ క్రమంలో రేవంత్.. మౌనిక నెమ్మదిగా ఒకరికొకరు దగ్గరవుతారు. అయితే వీరి ప్రేమకు కులం పెద్ద అడ్డ గోడలా కనిపిస్తుంది. ఈ అడ్డంకిని దాటి వీళ్లిద్దరూ ఒక్కటయ్యారా లేదా అన్నది మిగతా కథ.

ప్లస్ పాయింట్స్‌:

నాగ‌చైత‌న్య‌… సాయిప‌ల్ల‌వి న‌ట‌న‌.. శేఖ‌ర్ క‌మ్ముల మార్క్ భావోద్వేగాలు.. క‌థా నేప‌థ్యం ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్‌ అని చెప్పుకోవాలి. నాగచైతన్య రేవంత్ పాత్రలో ఒదిగిపోయాడు. ఇలాంటి పాత్రను ఎంచుకున్నందుకు అతడిని అభినందించాలి. ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగా చేసిన చైతూ.. ఎక్కడా ఎబ్బెట్టుగా అనిపించలేదు. ఇక సాయిపల్లవి గురించి చెప్పేదేముంది? ఎప్పట్లాగే అదరగొట్టేసింది. భావోద్వేగాలను పండించడంలో.. ఆ తరహా సన్నివేశాల్లో హావభావాలు పలికించడంలో తనకు తానే సాటి అని ఆమె మరోసారి రుజువు చేసుకుంది.

మైనస్ పాయింట్స్‌:

క‌థ అక్క‌డ‌క్క‌డా నెమ్మ‌దిగా సాగుతుండడం ఈ చిత్రానికి మైనస్ పాయింట్. ఒక రొటీన్ క్లైమాక్స్ తో సినిమాను ముగించి నిరాశకు గురి చేశాడు శేఖర్. ఇక నీ చిత్రం చూసి.. సారంగ దరియా పాటలు ఎంత బాగున్నప్పటికీ.. అవి సరైన సమయంలో రాకపోవడం వల్ల అనుకున్నంతగా ఎంజాయ్ చేయలేని పరిస్థితి నెలకొంది. హీరో హీరోయిన్ల మధ్య కొన్ని సన్నివేశాలు ఎమోషనల్‌గా అనిపించినా.. కథనం రొటీన్ గా ఉండటంతో ద్వితీయార్ధం భారంగానే అనిపిస్తుంది. శేఖర్ మార్కు ‘ఆహ్లాదం’ ద్వితీయార్ధంలో పూర్తిగా మిస్సయింది. ఈ ప్రతికూలతల వల్ల ‘లవ్ స్టోరి’ ఒక స్పెషల్ మూవీ కాలేకపోయింది. అలాగని ఈ సినిమాను తక్కువ చేయడానికి వీల్లేదు. టికెట్ డబ్బులకు న్యాయం చేసే చాలా అంశాలు ఇందులో ఉన్నాయి.

సాంకేతిక వర్గం:

సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. ప‌వ‌న్ సీహెచ్ సంగీతం చిత్రానికి ప్ర‌ధాన‌బ‌లం. పాట‌లు హ‌త్తుకుంటాయి. ‘నీ చిత్రం చూసి’, ‘ఏవో ఏవో క‌ల‌లే’ పాట‌ల చిత్ర‌ణ సినిమాకి హైలైట్‌గా నిలిచాయి. హోరెత్తించిన ‘సారంగ ద‌రియా’ పాట సినిమాలో ప‌ర్వాలేద‌పిస్తుందంతే. బహుశా బయట అనేక సార్లు విని, చూడటం వల్ల కూడా కావచ్చు. విజ‌య్ సి.కుమార్ కెమెరా ప్ర‌తీ స‌న్నివేశాన్నీ తెర‌పై స‌హ‌జంగా ఆవిష్క‌రించింది. శేఖ‌ర్ క‌మ్ముల త‌న మార్క్ మేకింగ్‌తోనే ప్ర‌స్తుత స‌మాజానికి అవ‌స‌ర‌మైన కొన్ని అంశాల్ని స్పృశించారు. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి.

తీర్పు: లవ్ స్టోరి.. ఫీల్‌ గుడ్‌ మూవీ..

విడుదల: 24-09-2021
రేటింగ్-2.5
నటీనటులు: అక్కినేని నాగచైతన్య-సాయిపల్లవి-రాజీవ్ కనకాల-ఈశ్వరి రావు-దేవయాని-ఉత్తేజ్ తదితరులు
సంగీతం: పవన్.సిహెచ్
నిర్మాతలు: నారాయణ్ దాస్ నారంగ్-పుష్కర్ రామ్మోహన్ రావు
దర్శకత్వం: శేఖర్ కమ్ముల

- Advertisement -