సినిమాలో నటించే నటీనటుల నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టుకోవడానికి ఒక్కో దర్శకుడు ఒక్కో రకమైన మార్గాన్ని అనుసరిస్తుంటారు. కొందరు సీన్ చెప్పి నటీనటులు తమ సొంత ఆలోచనతో చేసే అవకాశమిస్తారు. ఇంకొందరు మొత్తం విడమరిచి చెబుతారు. కానీ ..దర్శక ధీరుడు రాజమౌళి మాత్రం ఈ మూడు మార్గాల్నీ అనుసరిస్తాడట. లేక ఆయన స్టైల్లో వివరిస్తారా అనేది తెలీదు. ఐతే ఎవరికి ఏ పద్ధతి అన్నది ఆయా నటీనటుల్ని బట్టి ఆధారపడి ఉంటుందంటున్నాడు జక్కన్న. మరి ‘బాహుబలి’కి సంబంధించి తన నటీనటులతో తాను ఎలా ఔట్ పుట్ రాబట్టుకుంటానో ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి చెప్పేశాడు రాజమౌళి. మరి ఆ విశేషాన్నీ ఆయన మాటల్లోనే…
‘‘ప్రభాస్ బాహుబలి సినిమాలో హీరో కాబట్టి అతడికి ప్రతి చిన్న విషయం వివరిస్తాను. ముందు వెనుక సన్నివేశాలు ఎలా ఉంటాయో చెబుతాను. ఎలా నటించాలి అన్నది మాత్రం అతడికి చెప్పను. సన్నివేశం.. నేపథ్యం చెబితే అతను ఆకళింపు చేసుకుని.. తన ఆలోచనతో నటిస్తాడు. ఇక నాజర్ గారికైతే ముందు సన్నివేశం ఏంటో చెప్పి ఆ తర్వాత ఈ సీన్ గురించి చెప్పాలి. ఆయన తన స్టయిల్లో నటిస్తారు. రమ్యకృష్ణ గారికైతే ఏమీ చెప్పక్కర్లేదు. నేరుగా డైలాగ్ ఇస్తే చాలు.. అద్భుతంగా చేసేస్తారు. అనుష్కకు మాత్రం సీన్ చెప్పి ఎలా నటించాలో చెప్పాలి. ఒకసారి చేసి చూపించమని తను అడుగుతుంది. మనం చేశాక తర్వాత తను చేస్తుంది’’ అని రాజమౌళి వివరించాడు.