టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన జన్మదినం ఆగష్టు 22 సందర్భంగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమంలో పాల్గొనాలని ట్విట్టర్ ద్వారా అభిమానులకు పిలుపునిచ్చారు. ప్రకృతి వైపరిత్యాలు తగ్గాలంటే, కాలుష్యానికి చెక్ పెట్టాలంటే, భవిష్యత్ తరాలు బావుండాలంటే మొక్కలు నాటడం ఒక్కటే మార్గమని చెప్పారు. అందుకు, యంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన హరితయజ్ఞం “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో మీరంత పాల్గొనాలి, మూడు మొక్కలు నాటి, నాకు ట్విట్టర్ లో ట్యాగ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
చిరు ట్వీట్ పై స్పందించిన ఎంపీ సంతోష్ కుమార్ మెగాస్టార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రకృతి పరిరక్షణపై మెగాస్టార్ కి ఉన్న ప్రేమను తెలియజేస్తున్నదని, ఆయన పుట్టిన రోజున అభిమానులంతా మొక్కలు నాటి చిరు కానుకను అందించాలని ఆకాంక్షించారు. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో పాల్గొనే ప్రతీ అభిమాని చిరుకు ట్యాగ్ చేయాలని సంతోష్ కుమార్ సూచించారు. తన నటనతో కోట్లాది మంది హృదయాలను గెలిచిన మెగాస్టార్ ఆయురారోగ్యాలతో కలకాలం అభిమానులను అలరించాలని ఆకాంక్షించారు.