ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఎయిర్ పోర్టుల టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ తుది రిపోర్టులు కేంద్రం నుంచి అందాయి. మొత్తం ఆరింటిలో మూడు మాత్రమే ఎయిర్ పోర్టుల నిర్మాణానికి అనుకూలమని, మరో మూడు అనుకూలంగా లేవని ఎయిర్ పోర్టు అథారిటీ తేల్చింది. ఐతే ఫీజిబిలిటీ లేని ప్రాంతాల్లో కూడా తక్కువ సీటింగ్ కెపాసిటీ ఉన్న చిన్నచిన్న ఫ్లైట్లను లోకల్ గా నడిపేందుకు అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వం భారత విమానయాన సంస్థను విజ్ఞప్తి చేసింది. ఆ దిశలో స్టేక్ హోల్డర్స్ తో ఒక మీటింగ్ ను కూడా ఏర్పాటు చేయాలని కోరింది.
రాష్ట్రంలో ఎయిర్ పోర్టుల నిర్మాణం కోసం ప్రభుత్వం అడిగిన టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ తుది రిపోర్టులు కేంద్రం నుంచి మొన్న శనివారం నాడు రాష్ట్ర ప్రభుత్వానికి అందాయి. వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఎయిర్ పోర్టుల నిర్మాణ సాధ్యాసాధ్యాలు, వాటివల్ల కలిగే లాభనష్టాలను భారత విమానయాన సంస్థ బేరీజు వేసింది. మొత్తం ఆరింటిలో 3 మాత్రమే విమానాశ్రయాల ఏర్పాటుకు తగిన విధంగా ఉన్నాయని ఎయిర్ పోర్టు అథారిటీ తన నివేదికలో పేర్కొంది. వివిధ దఫాల్లో ఫీల్డ్ విజిట్ చేసిన కేంద్ర బృందాలు వరంగల్ మామూనూర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జక్రాన్ పల్లిలు విమానాశ్రయాల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నాయనీ, భద్రాద్రి కొత్తగూడెంలోని పాల్వంచ, మహబూబ్నగర్లోని దేవరకద్ర, పెద్దపల్లిలోని బసంత్ నగర్లు ఎయిర్ పోర్టుల ఏర్పాటుకు అనుకూలంగా లేవని భారత విమానయాన సంస్థకు నివేదించాయి. ఆ మేరకు ఎయిర్ పోర్టు అథారిటీ నుంచి తెలంగాణాకు టీఈఎఫ్ఆర్ తుది నివేదికలు అందాయి.
కేంద్రం అందించిన నివేదికలకు బదులుగా తెలంగాణా ప్రభుత్వం ఈ నెల 7 వ తేదీన కేంద్రానికి ఒక డీఓ లెటర్ రాసింది. కమర్షియల్ గా కాకపోయినా, ఫీజిబిలిటీ లేని చోట్ల నుంచి కూడా లోకల్ గా 18 నుంచి 20 సీట్ల కెపాసిటీ ఉన్న విమానాలను రాష్ట్ర ప్రభుత్వం నడిపేలా అనుమతివ్వాలని కోరింది. అవసరమైతే మరోసారి కేంద్ర బృందాలు గ్రీన్ (ప్రస్తుతం ఉన్న స్ట్రిప్స్), బ్రౌన్ (కొత్త స్ట్రిప్స్) ఫీల్డుల్లో క్షేత్రపరిశీలన చేయాలని అడిగింది. ఈ దిశలో స్టేక్ హోల్డర్స్ తో ఒక సమావేశం కూడా నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది.
రాష్ట్రంలో విమానాశ్రయాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ ఢిల్లీలోని కేంద్ర పౌర విమానయాన శాఖతో నిరంతరం సమన్వయం చేస్తున్నారు. భారత విమానయాన సంస్థ చైర్మన్ సంజీవ్ కుమార్, ఐఏఎస్ ను అడ్రెస్ చేస్తూ ఆయన మొన్న శనివారం నాడు ఒక డీఓ లెటర్ కూడా రాసారు. కేంద్రం నుంచి వచ్చే స్పందనను బట్టి భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.