భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్ లో అదరగొట్టింది. ఇవాళ జరిగిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో జపాన్ అమ్మాయి అకానే యమగూచిని చిత్తుగా ఓడించిన సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి నుంచి దూకుడు ప్రదర్శించిన సింధు 21-13, 22-20తో యమగుచిని మట్టి కరిపించి సెమీస్‌కు దూసుకెళ్లి మరో పతకానికి అంగుళం దూరంలో నిలిచింది. ప్రపంచ చాంపియన్ సింధు గత ఒలింపిక్స్‌లో రజత పతకం గెలుచుకుంది.
సింధు సెమీస్‌లో శనివారం ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి అయిన తైవాన్‌కు టై టిజు యింగ్ లేదంటే, థాయిలాండ్‌కు చెందిన ప్రపంచ నంబర్ 6 క్రీడాకారిణి రచనోక్ ఇంటానాన్‌తో కానీ తలపడుతుంది. కాగా, నిన్న రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో ప్రపంచ నంబరు 12 క్రీడాకారిణి మియా బ్లిచ్‌ఫెల్ట్‌ను 41 నిమిషాల్లోనే ఓడించింది. కాగా, డెన్మార్క్‌కు చెందిన మియా ఈ ఏడాది జనవరిలో సింధును వరుస సెట్లలో ఓడించడం గమనార్హం. ఈ ఒలింపిక్స్ లో సెమీస్‌లో సింధు గెలిస్తే కనీసం సిల్వర్ మెడల్ ఖాయమవుతుంది.