పాలకుర్తి నియోజకవర్గంలో 560 ఎకరాలలో ఏర్పాటు చేయనున్న ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ పనులను సకాలంలో పూర్తి చేసేందుకు వేగవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. సోమవారం పాలకుర్తిలోని క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, ఆర్డివో, ఎమ్మార్వోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలతో వ్యవసాయ రంగం సస్యశ్యామలం అయ్యిందని, వ్వవసాయ ఉత్పత్తుల అభివృద్ది జరుగిందన్నారు. మన ప్రాంతంలో పండించిన వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తుందని అన్నారు. 5 నుంచి 6 వందల ఎకరాల్లో సకల సౌకర్యాలతో జనగామ జిల్లా దేవరుప్పుల – మన్‌పహాడ్-లక్ష్మక్కపల్లి గ్రామాల శివారులో ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ ఏర్పాటుకు భూసెకరణ చేపట్టినట్లు తెలిపారు. అధికారులు భూసెకరణ వేగంగా పూర్తి చేసి, సెజ్‌లో మౌళిక సధుపాయాలు కల్పించేందుకు యుధ్ద ప్రాతిపధికన పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
జనగామ జిల్లాలో జరిగే పాల సేకరణ పాలకుర్తి పరిసర మండలాల్లో అత్యధికంగా ఉంటుందని, పాలకుర్తి కేంద్రంగా పాలశీతలీకరణ కేంద్రంతో పాటు, మిల్క్ ప్రొడక్ట్స్ పరిశ్రమ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర డైరీ డెవలంప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్, యం.డిలకు ఫోన్ చేసి మాట్లాడారు. పాలకుర్తి నియోజకవర్గంలో నిర్మాణాలు పూర్తి అయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను కేటాయించేందుకు ఆయా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి, అర్హులైన లభ్ధిదారులను ఎంపిక చేయాలని, అర్హులు ఎక్కువగా ఉన్నచోట లాటరీ పద్దతిన లభ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. ఈ ప్రక్రీయను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు.