జీవకోటి ప్రాణాధారమైన మొక్కలను కాపాడాలన్న సదుద్దేశంతో.. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆద్వర్యంలో చేపట్టిన ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం విజయవంతమయ్యింది. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో, పలు దేశాల్లో కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటి ముక్కోటి వ్రక్షార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో పాలుపంచుకున్న ప్రతీ ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు రాజ్యసభ సభ్యులు,ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్.
శనివారం ఉదయం ఆరున్నరకు రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ప్రొటెం ఛైర్మన్ భూపాల్ రెడ్డిలు మొదలు పెట్టి రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, సినిమా, వ్యాపార, పారిశ్రామిక వర్గాలు.. విద్యార్ధులు, స్వచ్చంద సంస్థలు, ఎన్ఆర్ ఐలు.. ఇలా ఒక్కరేమిటి..? లక్షలాది మంది ఈ కార్యక్రమలో పాల్గొన్నారు. అందరికీ పేరుపేరున ముక్కోటి ధన్యవాదాలు అని ఎంపీ సంతోష్ కుమర్ తెలిపారు.
అద్భుత స్పందన..
గతంలో కోటి వృక్షార్చన కార్యక్రమం విజయవంతం కావడంతో మా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో మా ప్రియతమ నాయకుడు కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించాం. అతి తక్కువ సమయంలోనే అద్భుత స్పందన వచ్చింది. నేను స్వయంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రామగుండంలో, గోదావరిఖని, సింగరేణి ఏరియా, సుల్తానాబాద్, చొప్పదండి నియోజక వర్గంలో వెడురుగట్ట, కుదురుపాకల్లో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎంపీ వెంకటేశ్, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, దాసరి మనోహర్ రెడ్డి, సుంకె రవిశంకర్ ఇత ప్రజా ప్రతినిధులు, అధికారులు, పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన ప్రజలతో కలిసి అయా ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నాను అని ఎంపీ సంతోష్ పేర్కొన్నారు.
సాయంత్రం అయిదున్నర వరకు ఉన్న ప్రాథమిక సమాచారం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క గ్రామాల్లోనే 2 కోట్ల 5 లక్షలు మొక్కలు నాటారు. GHMC మేయర్, కార్పొరేటర్ లు కలిపి హైదరాబాద్ వ్యాప్తంగా 10 లక్షల మొక్కలు. 142 మున్సిపాలిటీలలో చైర్మన్ లు, కౌన్సిలర్ల సహకారంతో 25 లక్షలు మొక్కలు, అన్ని కాలనీ సంఘాలు, ఇతరులు కలిసి 20 లక్షల మొక్కలు, అటవీ శాఖ పరిధిలోని ఖాళీ స్థలాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల ఆద్వర్యంలో 50 లక్షల మొక్కలు, HMDA పరిధిలో ప్రజాప్రతినిధులతో 20 లక్షలు మొక్కలు, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన సమాచారం ప్రకారం మొత్తం కలిపి 3 కోట్ల 30 లక్షల మొక్కలు నాటినట్లు సమాచారం అందింది. ఇది సాధారణ విషయం కాదు. అందుకే మరోసారి ఈ మహాక్రతవులో భాగస్వామ్యమైన అందరికీ కృతజ్ఙతలు అని ఎంపీ సంతోష్ కుమార్ తెలిపారు.