ప్రతి ఒక్కరూ చెట్టు, చెత్తపై దృష్టి పెట్టాలి- మంత్రి హరీష్

224
harish
- Advertisement -

మంత్రి హరీష్ రావు ఈరోజు జిల్లా కేంద్రమైన సిద్ధిపేట మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, పట్టణ ప్రముఖ నాయకులతో పట్టణ అభివృద్ధి, ప్రగతి అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో చెత్త ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. చెత్త, చెట్టుతో ఇప్పుడు ప్రపంచంలో ఇబ్బందులు ఉన్నాయి. చెత్త, చెట్టు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కౌన్సిలర్లకు మంత్రి సూచించారు. సిద్దిపేట మున్సిపల్ కౌన్సిల్ చురుకుగా ఉంది, మంచిగా పని చేయాలని కౌన్సిలర్లకు పిలుపునిచ్చారు. చెట్లు పెంచే విషయంలో మున్సిపాలిటీలో కొంత ముందు ఉన్నాం. సిద్దిపేట మున్సిపాలిటీలో చెట్టు కొట్టాలంటే భయం ఉంది. అనుమతి లేనిదే చెట్టు కొట్టొద్దని మున్సిపల్ కఠినంగా పనిచేస్తున్నది.

ఖాళీ స్థలం ఉండొద్దని, రోడ్డుకిరువైపులా, ఇన్సిట్యూషనల్ ప్లాంటేషన్ చేయాలని, మొక్కలు ఎన్ని అయినా ఉచితంగా ఇస్తామని కౌన్సిలర్లకు ఆదేశించారు.ప్రధానంగా చెత్త విషయంలో సిద్దిపేట ఆదర్శంగా ఉండాలి. ఇందుకు మీ కౌన్సిలర్ల సహకారాన్ని తీసుకుంటాం. బెంగుళూరుకు చెందిన ప్రముఖ సామాజిక సేవకురాలు-శాంతి ఇక్కడకు చెత్తపై అవగాహన కోసం వచ్చారు, వారికి సహకారం అందిద్దాం అన్నారు. చెత్త రహిత సిద్దిపేట కావాలన్నదే మన మున్సిపాలిటీ లక్ష్యంగా పని చేద్దాం. ప్రతి రోజు 55 వేల కిలోల చెత్త మున్సిపాలిటీలో ఉత్పత్తి అవుతున్నది. దీంతో ప్రతి యేటా 1 కోటి 98 లక్షల కిలోల చెత్త వస్తున్నదని కుప్పలుగా పేరుకుపోతున్నదని మంత్రి తెలిపారు.

స్థానిక, రాష్ట్ర, దేశ పరిపాలన అనే మూడు భాగాలు ఉంటాయి. ఒక కౌన్సిలర్ గెలిచిన మీపై పెద్ద గురుతర బాధ్యత ఉంది. మీరే ఈ ప్రభుత్వం.వనరుల సమీకరణ, వనరులను ఖర్చు చేయడం అనే అంశాలపై చర్చ జరిపి నిర్ణయాలు తీసుకునే అవకాశం రాబాట్టాలి. ఈ పట్టణ ప్రజల బాధ్యత మీదే.. పట్టణాన్ని, ఈ పట్టణ ప్రజలను పరిపాలించే అధికారం మీదే అన్నారు. చెత్త ఎక్కువ కావడం వల్ల దుర్గంధంగా మారుతున్నది. సిద్దిపేటలోని ప్రస్తుత 39వ వార్డులోని స్వచ్ఛబడి రాష్ట్రానికే ఆదర్శంగా మార్చుదామని కౌన్సిలర్లకు మంత్రి పిలుపు నిచ్చారు.ప్రతి ఒక్కరూ స్వచ్ఛబడికి వెళ్లే విధంగా చూడాలి, ఇందు కోసం ప్రతీ కౌన్సిలర్లు బాధ్యత వహించాలి. చెత్త నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పిద్దాం. ప్రజలను చైతన్యం చేసి తడి, పొడి, హానికర చెత్తగా మార్చుదాం, దీంతో డంపు యార్డు అవకాశం ఉండదు.

చెత్తలో 60 శాతం తడి చెత్త ఉంటుంది. త్వరలోనే రూ. 4.30 కోట్లతో తెలంగాణలో తొలిసారి సిద్ధిపేట మున్సిపాలిటీలో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం. చెత్త ద్వారా ఆదాయం వచ్చే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. పొడి చెత్త ద్వారా యేటా రూ.2.50 లక్షల ఆదాయం వస్తున్నది. ఇప్పుడు హోం కంపోస్టింగ్ ప్రక్రియ మొదలుపెట్టి, ముందుగా కౌన్సిలర్లు తమ ఇంట్లో మొదలు పెట్టాలని పిలుపునిచ్చారు. పట్టణంలోని మూడు వార్డులో వార్డు స్థాయి కంపోస్టింగ్ ప్లాంట్ ఏర్పాటు చేశాం. డంప్ యార్డు అర్థం మార్చేశాం, సీనియర్ కౌన్సిలర్లు దీప్తి నాగరాజు, బర్ల మల్లిఖార్జున్, కెమ్మసారం ప్రవీణ్ లను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలి. ప్రతి ఒక్కరూ చెట్టు, చెత్త పై దృష్టి పెట్టాలి, పదవి శాశ్వతం కాదు చేసిన పని శాశ్వతంగా ఉంటుందని మంత్రి వెల్లడించారు.

పట్టణంలో యూజీడీ పనులు జాప్యంతో నడుస్తున్నాయని, ప్రతీ వార్డులో ప్రతి ఇంటికీ యూజీడీ కనెక్టివిటీ ఇవ్వాలి. దోమ రహిత పట్టణంగా సిద్ధిపేటను మార్చుదామని కౌన్సిలర్లకు సూచించారు. యూజీడీలో భాగంగా పట్టణాన్ని మూడు భాగాలుగా విభజన చేశాం. కొద్దీ రోజుల్లో పూర్తి చేస్తాం. పట్టణ ప్రగతి లో సమస్యలు గుర్తించాం. చెత్త సేకరణ ప్రతి రోజు జరగాలి.మున్సిపల్ ప్రతినిధులుగా మీరు ఛాలెంజింగ్ తో పని చేయాలి. జియో ట్యాగ్ ప్రకారం చెత్త సేకరణ వాహనాలు పని చేస్తున్నాయా లేదా చూడాలి, చెత్త రోడ్డు మీద వేసి వారికి జరిమానా వేయండి అని మంత్రి అధికారులను ఆదేశించారు. చెట్టు కొట్టిన వారికి జరిమానా విధింపు, జైలుకు కూడా వెళ్లారు. చెట్టు నరికిన వారు ఎవ్వరైనా వదిలేది లేదు అన్నారు.

చెత్త, చెట్టు, యూజీడీ చేస్తే బాగుంటుందని మంత్రి అభిప్రాయపడ్డారు. వ్యాధులు లేని సమాజం నిర్మాణం ఈ మూడింటి ద్వారా సాధ్యం అవుతుంది. స్టీల్ బ్యాంకు అనేది అన్ని వార్డులో పెట్టాం. వాటిని వినియోగం చేయాలి. ప్లాస్టిక్ రహిత సిద్దిపేట సాధిద్దాం. ఇందు కోసం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తిని నిషేధిద్దామని మంత్రి హరీష్‌ పిలుపునిచ్చారు.

- Advertisement -