కరోనా సెకండ్ వేవ్ నుంచి భారత్ బయటపడుతున్నది. కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. 81 రోజుల కనిష్ఠ స్థాయిలో కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 58,419 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దాని ప్రకారం… కరోనా నుండి కొత్తగా 87,619 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,98,81,965కు చేరింది. మరో 1576 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,86,713కు పెరిగింది.
ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,87,66,009 మంది కోలుకున్నారు. 7,29,243 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. వ్యాక్సినేషన్ కు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 27,66,93,572 డోసులు ఇచ్చారు. ప్రస్తుతం రికవరీ రేటు 96.27 శాతానికి పెరిగిందని, వీక్లీ పాజిటివిటీ రేటు ఐదు శాతానికి కన్నా తక్కువగా ఉందని మంత్రిత్వ శాఖ చెప్పింది.
ప్రస్తుతం వ్లీకీ పాజిటివిటీ రేటు 3.43 శాతంగా ఉందని, రోజువారీ పాజిటివిటీ రేటు 3.22 శాతం ఉందని.. వరుసగా 13 రోజుల్లో ఐదుశాతానికి కన్నా తక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వివరించింది. దేశంలో నిన్నటి వరకు 39.10 కోట్ల కొవిడ్ శాంపిల్స్ పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.