పగటి పూట కర్ఫ్యూపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉన్న కర్ఫ్యూను పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20 వరకు కర్ఫ్యూను పొడిగించాలని వెల్లడించింది. 10న కర్ఫ్యూ గడువు పూర్తి కానుండడంతో రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, కర్ఫ్యూ అమలుపై అధికారులతో సోమవారం సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. కేసులు మరింత తగ్గే వరకు కర్ఫ్యూ కొనసాగించడమే మంచిదని సమావేశంలో నిర్ణయించారు.
అధికారులు అందజేసిన నివేదికలను పరిశీలించిన సీఎం.. 20 వరకు కర్ఫ్యూను పొడిగించారు. అయితే, కర్ఫ్యూలో మినహాయింపుల వ్యవధిని పెంచారు. మరో రెండు గంటలు అదనపు సమయాన్ని కేటాయించారు. ఇప్పటిదాకా ఉదయం ఆరింటి నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే వివిధ పనుల కోసం అనుమతులిస్తున్నా.. ఇప్పుడు దానిని రెండింటి వరకు పెంచారు. జూన్ 11 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.