ఆనందయ్య కరోనా మందు పంపిణీని ఈ నెల 7(సోమవారం) నుంచి చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు మందుల కిట్లు పంపిణీ చేస్తామన్నారు. ముందుగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు అందిస్తామని ఆనందయ్య స్పష్టం చేశారు. కరోనా మందు పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. ఆ తర్వాత మిగతా ప్రాంతాల్లో పంపిణీ చేయాలని నిర్ణయించామని తెలిపారు. అయితే, ఔషధ పంపిణీ కోసం రూపొందించిన వెబ్‌సైట్‌తో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదని ఆయన చెప్పారు. దీనిపై రాజకీయాలు చేయకూడదని ఆయన చెప్పారు.
కాగా, ఈ ఔషధానికి ‘ఔషధచక్ర’ అని పేరు పెట్టారు. ఆ మందు తయారీ పెద్ద ఎత్తున జరుగుతోంది. కృష్ణపట్నం పోర్టు వద్ద దీన్ని తయారు చేస్తున్నారు. ఇందుకోసం కృష్ణపట్నం పోర్టుకు చెందిన సీవీఆర్ కాంప్లెక్స్‌ను వాడుకుంటున్నారు. మొదట సర్వేపల్లి నియోజకవర్గంలో లక్షమందికి కరోనా రానివారు వాడే మందును అందజేయాలని ఆనందయ్య బృందం ఇప్పటికే నిర్ణయించింది. అనంతరం కరోనా రోగులకు అవసరమైన మందును పంపిణీ చేస్తారు. ఆ తర్వాతే ఇతర ప్రాంతాలకు పంపిణీ చేయనున్నారు.
మందును అధికార యంత్రాంగం ద్వారా అన్ని జిల్లాలకు పంపుతామని, అధికారుల నేతృత్వంలో పంపిణీ జరుగుతుందని స్పష్టం చేశారు. మందు తయారీ, పంపిణీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన క్రమంలో సాధ్యమైనంత ఎక్కువమంది ప్రజలకు సేవ చేసే అవకాశం దొరికిందన్నారు. మందు కోసం ఎవరూ నేరుగా కృష్ణపట్నం రావద్దని ఆయన విజ్జప్తి చేశారు.