పర్యావరణ దినోత్సవం.. మొక్కలు నాటిన గవర్నర్..

136
Governor Dr. Tamilisai
- Advertisement -

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర‌ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం రాజ్ భవన్ ఆవ‌ర‌ణ‌లో మొక్కలను నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు, ఎంపీ జె. సంతోష్ కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని గవర్నర్‌తో కలిసి మొక్కను నాటారు. అనంత‌రం ఎంపీ సంతోష్ కుమార్‌ “వృక్ష వేదం” పుస్తకాన్ని గవర్నర్‌కు అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో గ‌వ‌ర్న‌ర్ భ‌ర్త‌, ప్ర‌ఖ్యాత నెఫ్రాల‌జిస్ట్ డాక్ట‌ర్ పి.సౌంద‌ర‌రాజ‌న్‌, గ‌వ‌ర్న‌ర్ కార్య‌ద‌ర్శి కె.సురేంద్ర మోహ‌న్‌, జాయింట్ సెక్ర‌ట‌రీలు, ఇత‌ర సీనియ‌ర్ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. మన రాష్ట్రం, దేశాన్ని పచ్చదనం చేయడంలో అన్ని వర్గాల ప్రజలు చేతులు కలపాలని పిలుపునిచ్చారు.పర్యావరణ వ్యవస్థను రక్షించడం, పునరుద్ధరించడం, ప్రోత్సహించడం భూమాత ఆరోగ్యానికి చాలా అవసరం అన్నారు. భవిష్యత్ తరాల శ్రేయస్సు కోసం మనం ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థను అందివ్వాల‌న్నారు. దీనికోసం స్థిరమైన అభివృద్ధి నమూనాలను అనుసరించాల‌ని ఆమె తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి ప్రస్తావిస్తూ గ్రీన్ కవర్ మెరుగుపరచడానికి ఎంపీ సంతోష్ కుమార్ చేస్తున్న కృషిని గ‌వ‌ర్న‌ర్ ప్రశంసించారు. ప‌చ్చ‌ద‌నాన్ని పెంపొందించేందుకు వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను క‌లుపుకొని 10 కోట్ల‌కు పైగా మొక్క‌లు నాట‌డం గొప్ప విష‌య‌మ‌ని కొనియాడారు.

- Advertisement -