కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్-19 కేసులు గణనీయంగా తగ్గడంతో మే 31 నుంచి దశలవారీగా లాక్‌డౌన్ నియంత్రణలను సడలిస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ప్రజలు కరోనా బారినపడకుండా కాపాడటంతో పాటు వారు ఆకలితో చనిపోయే పరిస్థితి తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఢిల్లీలో మే 31 నుంచి దశలవారీగా అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు.
కార్మికులు, వలస కూలీల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని నిర్మాణ కార్యకలాపాలను అనుమతించడంతో పాటు ఫ్యాక్టరీలు తిరిగి పనులు ప్రారంభించేలా చర్యలు చేపడతామని చెప్పారు. ఇక ఢిల్లీలో కరోనా పాజిటివిటీ రేటు 1.5 శాతానికి పడిపోయిందని, అయినా మహమ్మారిపై పోరు ముగిసిపోలేదని అన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్, డీడీఎంఏ చీఫ్ సహా పలువురు ఉన్నతాధికారులతో కీలక భేటీ అనంతరం అన్‌లాక్ ప్రక్రియను కేజ్రీవాల్ ప్రకటించారు.