యాస్ తుఫానుతో పలు రాష్ట్రలు అతలాకుతలం అయ్యాయి.. తెలంగాణపై కూడా ఈ తుఫాను ప్రభావం చూపుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తుఫాను ప్రభావంతో గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని చెప్పింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అనేక జిల్లాలలో గాలులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
కాగా, రోహిణి కార్తె ప్రభావంతో రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. బుధవారం ఎండలు దంచి కొట్టాయి. ములుగు, భూపాలపల్లి, భద్రాద్రికొత్తగూడెం, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో 43 డిగ్రీలపైన నమోదయ్యాయి. అత్యధికంగా ములుగు జిల్లా వెంకటాపూర్లో 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జీహెచ్ఎంసీలోని నారాయణగూడలో అత్యధికంగా 39.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయ్యింది. రాత్రి ఉష్ణోగ్రతలు అత్యంత తక్కువగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయుడుగూడెంలో 20.6, జీహెచ్ఎంసీలోని బీహెచ్ఈఎల్లో 25.5 డిగ్రీలుగా నయోదయ్యాయి.