ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ వ్యాధిగ్రస్తులకు మెరుగైన సేవలందించి, ప్రజల్లో నమ్మకం కల్పించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జనగామ జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు, అధికారులతో కోవిడ్ నియంత్రణ చర్యలు, యాసంగి ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జిల్లాలో కోవిడ్ పాజిటివ్ రేట్ 20 శాతం ఉన్నట్లు, వైద్యాధికారులు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి, కోవిడ్ మహమ్మారి నియంత్రణకై పనిచేయాలన్నారు. ఇంటింటి ఆరోగ్య సర్వే నిర్వహిస్తున్నట్లు, కోవిడ్ లక్షణాలు ఉన్న 5 వేల 510 మందికి ఇంటి వద్దనే మందులతో కూడిన హెల్త్ కిట్లు అందజేసినట్లు తెలిపారు. ప్రతి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ ఓపి సేవలు చేపట్టి, కోవిడ్ లక్షణాలు ఉన్న ఒక వేయి 889 మందికి హెల్త్ కిట్లు అందజేసినట్లు, మందులు వాడుతున్నప్పటికి 4 రోజులకు లక్షణాలు తగ్గని 54 మందికి స్టెరాయిడ్స్ ఇవ్వడం ప్రారంభించినట్లు తెలిపారు.
అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఆసుపత్రులకు తరలించడానికి 7 అంబులెన్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లాలో పడకలు, ఆక్సిజన్, రెమిడిసిర్ ఇంజెక్షన్ల కొరత లేదని మంత్రి దయాకర్ రావు అన్నారు. ఆక్సిజన్ బెడ్లను పెంచడానికి వెంటనే చర్యలు చేపట్టామన్నారు. ప్రతి మండలంలో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటుచేసి, అన్ని వసతులు కల్పించినట్లు ఆయన అన్నారు. పరిశుభ్రత చాలా ముఖ్యమని, గ్రామాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా సర్పంచులు, కార్యదర్శులు కృషి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులను ఇంకా బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని మంత్రి తెలిపారు. ఖాళీలతో సంబంధం లేకుండా, వైద్య, పారామెడికల్ సిబ్బందిని మూడు నెలల కొరకు నియమించుకోవాలని ఆయన అన్నారు. బాలవికాస, ఎమ్మెల్యేల, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని అన్నారు.
కోవిడ్ వ్యాధిగ్రస్తులకు ప్రతిరోజూ ఫోన్లో మాట్లాడి, వారికి ధైర్యం చెప్పాలన్నారు. పీపీఇ కిట్లు, మాస్కులు, గ్లౌజులు, మందులు కావాల్సినన్ని అందజేస్తామన్నారు. జిల్లా కేంద్రంలో 8247847692 నెంబర్తో కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటుచేసినట్లు, ఈ కేంద్రం ద్వారా హెల్త్ కిట్లు అందజేసినవారికి నేరుగా ఫోన్ చేసి, వారి ఆరోగ్య సమాచారం, సేవల గురించి తెలుసుకొని, అవసరమైన పక్షంలో ఇంకా మెరుగైన సేవల కొరకు వైద్యాధికారుల దృష్టికి తీసుకెళుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్, వరంగల్ లో వైద్యం, జనగామ లో వైద్యం ఒకటేనని, జనగామలో అన్ని సదుపాయాలు, వైద్యులు ఉన్నారని, జిల్లా ప్రజలు ఇక్కడే సేవలు పొందేలా వారికి అవగాహన కల్పించాలని మంత్రి అన్నారు.
తడిసిన ధాన్యాన్ని కొంటాం..
తడిసిన ధాన్యాన్ని కొంటామని, రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని మంత్రి అన్నారు. జిల్లావ్యాప్తంగా 195 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి, రోజుకు 5 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయటం లేదని, కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో ఎటువంటి సహాయం చేయట్లేదని, కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే రాష్ర్ట ప్రభుత్వం బ్యాంకుల ద్వారా 30 వేల కోట్లు అప్పులు తీసుకొని, రైతుల ధాన్యం కొనుగోలు చేస్తుందని అన్నారు. ఇప్పటివరకు 12 వేల 224 మంది రైతుల నుండి, 73 వేల 886 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు, 5 వేల 542 మంది రైతుల ఖాతాలకు రూ. 57 కోట్ల 9 లక్షల 96 వేలు జమచేసినట్లు ఆయన తెలిపారు. రైతులు సంయమనంతో ఓపిక పట్టాలని, కొంత ఆలస్యమైనా పండించిన చివరి గింజ కొంటామని మంత్రి తెలిపారు. రైస్ మిల్లర్లు రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. కష్ట కాలంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన అన్నారు. జిల్లా అధికారులు టీమ్ వర్క్ గా పనిచేసి, రైతులకు అవగాహన కల్పించాలని ఆయన అన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ కె. నిఖిల, జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, జనగామ, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తాటికొండ రాజయ్య, అదనపు కలెక్టర్లు ఏ. భాస్కర్ రావు, అబ్దుల్ హమీద్, మునిసిపల్ చైర్ పర్సన్ పోకల జమున, ఏసీపీ వినోద్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డా. ఏ. మహేందర్, డీఆర్డీవో జి. రాంరెడ్డి, డిపీవో రంగాచారి, డిసిఎస్ఓ రోజారాణి, డిఎంవో నాగేశ్వర శర్మ, డీఏఓ రాధిక, జెడ్పి సిఇఓ విజయలక్ష్మి, జనగామ మునిసిపల్ కమీషనర్ నర్సింహా, అధికారులు తదితరులు పాల్గొన్నారు.