జూలై 4న దొడ్డి కొమురయ్య విగ్రహావిష్కరణ…

260
dayakar
- Advertisement -

తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఆయన అమరుడైన జూలై 4వ తేదీన ఆయన స్వగ్రామం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి లో ఆవిష్కరిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఈ మేరకు కడవెండి నుండి వచ్చిన దొడ్డి కొమురయ్య వారసులు, గ్రామస్తులు, మండల నాయకుల సమక్షంలో హన్మకొండలోని తన క్యాంప్ కార్యాలయంలో దొడ్డి కొమురయ్య సంస్మరణ ఉత్సవాల పోస్టర్ ను మంత్రి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అన్నారు. ఆనాడు ఆయన ప్రాణ త్యాగం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసిందన్నారు. నాటి హైదరాబాద్ దేశానికి నైజాం, రజాకార్ల నుండి విముక్తి కలగడానికి బాటలు వేసిందన్నారు. ప్రజలు తమ విముక్తికోసం సాయుధులై సమర శంఖం పూరించేలా పురికొల్పింది అని మంత్రి చెప్పారు. దొడ్డి కొమురయ్య గురించి సందర్భం వచ్చినప్పుడల్లా, సీఎం కెసిఆర్ ప్రస్తావిస్తారని అన్నారు, ఆయన నా పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన వాడు కావడం గర్వకారణం అన్నారు. దొడ్డి కొమురయ్య స్ఫూర్తి తో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, ఆయన ఊరు కడవెండి ని ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి వివరించారు. అందరి భాగస్వామ్యంతో ఆ కార్యక్రమం నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.

- Advertisement -