పల్లె ప్రగతి, పచ్చదనం-పరిశుభ్రత-పారిశుద్ధ్యం ఒక జీవన విధానం కావాలి. గ్రామాల్లో నిత్యం పారిశుద్ధ్యం కొనసాగాలి. నర్సరీలను, నాటిన మొక్కలను సంరక్షించాలి. డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు అన్నీ ఉపయోగంలోకి తేవాలి. ప్రతి గ్రామం దేశానికి ఆదర్శంగా నిలవాలి. అవార్డులు రావాలి. కరోనా విజృంభన నేపథ్యంలో మరింత అప్రమత్తంగా సర్పంచ్ లు, గ్రామ కార్యదర్శులు, ఇతర అధికారులు పని చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సర్పంచ్ లు, గ్రామ కార్యదర్శులను ఆదేశించారు.
గురువారం హైదరాబాద్ లోని తన కార్యాలయం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, డిఆర్ డిఓలు, డిపిఓలు, డిఎల్ పీఓలు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, సర్పంచ్ లు, గ్రామ కార్యదర్శులు తదితర అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతోపాటు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు, డిప్యూటీ కమిషనర్లు రవిందర్, రామారావు, తదితర అధికారులు పాల్గొన్నారు.