గిరిజన భవన్‌ల నిర్మాణాన్ని వేగవంతం చేయండి: సత్యవతి

194
sathyavathi
- Advertisement -

అంతరించిపోతున్న ఆదివాసీ తెగల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, వారికి ఆరోగ్య లక్ష్మీ పథకం ద్వారా అదనపు పోషకాహారాన్ని అందించేందుకు గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు చెప్పారు. రానున్న ఆర్ధిక సంవత్సరానికి ముఖ్యమంత్రి కేసిఆర్ ఈ రెండు శాఖలకు గత ఏడాది కంటే ఎక్కువ నిధులు కేటాయించిన నేపథ్యంలో ప్రభుత్వ లక్ష్యాలకనుగుణంగా వాటిని సద్వినియోగం చేయడంపై నేడు హైదరాబాద్, దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, కార్యదర్శి శ్రీమతి క్రిస్టినా జడ్ చోంగ్తు, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి శ్రీమతి దివ్య, గిరిజన గురుకులాల సంస్థ కార్యదర్శి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్, ఇతర అధికారులతో సమీక్ష చేశారు.

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ముఖ్యమంత్రి కేసిఆర్ మానస పుత్రిక అయిన ఆరోగ్య లక్ష్మీ పథకానికి ఈ బడ్జెట్ లో ఏకంగా వంద శాతం నిధులు పెంచడం ద్వారా మహిళల ఆరోగ్యానికి ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజెప్పారన్నారు. అయితే గిరిజన గూడాలు, ఆదివాసీ పెంటలు, లంబాడి తండాలలో ఉంటున్న వివిధ తెగలు ముఖ్యంగా అంతరించిపోతున్న ఆదివాసీ తెగల్లో పోషకాహార లోపంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఇందుకోసం ఆరోగ్య లక్ష్మీ పథకాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. వీరి ఆరోగ్యాన్ని నిరంతరం అంగన్ వాడీల ద్వారా పర్యవేక్షించాలని చెప్పారు.

ఇక కోవిడ్ మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కొనసాగుతున్న ఇంటింటికి రేషన్ మరింత పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. ముఖ్యంగా పాఠశాలలు మూత పడడం వల్ల నిత్యావసరాలకు ఇబ్బంది పడకుండా అంగన్ వాడీ సిబ్బంది పనిచేయాలని సూచించారు. గిరిజన శాఖకు కూడా భారీ ఎత్తున బడ్జెట్ పెంచడం వల్ల ఈసారి గిరిజన యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఒకేషనల్ కోర్సులు పెట్టాలన్నారు. ఇందులో ముఖ్యంగా మార్కెట్ డిమాండ్ ఉండి, జీవనోపాధికి చేయుతనిచ్చే విధంగా కోర్సులను డిజైన్ చేసి అమలు చేయాలన్నారు.

గిరిజన ఆత్మగౌరవ ప్రతీకలుగా భావించే గిరిజన భవన్ ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, ఎప్పటికప్పుడు స్థానిక ప్రజా ప్రతినిధులతో ఇంజనీరింగ్ శాఖ అధికారులు సమన్వయం చేసుకుని పనిచేయాలన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ గారు ప్రతిష్టాత్మకంగా భావించి 230 కోట్ల రూపాయలతో అమలు చేస్తున్న గిరిజన ఆవాసాలన్నింటికి 3 ఫేజ్ కరెంట్ పనులు కూడా వేగవంతం చేయాలన్నారు.

రోడ్డు వసతులు లేని ఏవైనా గిరిజన ఆవాసాలు ఉంటే వెంటనే వాటికి రోడ్లు వేసే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేసి, సమర్పించాలన్నారు. నియోజక వర్గాల వారిగా రోడ్లు వేయడాన్ని వెంటనే ఇంజనీరింగ్ శాఖ ద్వారా ప్రతిపాదనలు సిద్ధం చేయించాలన్నారు. ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల సంతోషం కోసం పనిచేసి సిఎం కేసిఆర్ గారు ఈసారి బడ్జెట్ లో రెండు శాఖలకు గత బడ్జెట్ కంటే ఎక్కువగా కేటాయించి నిధులను సరిగ్గా సద్వినియోగం చేయాలన్నారు.

- Advertisement -