పాలమూరు పచ్చబడాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమన్నారు మంత్రి హరీష్ రావు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన హరీష్ రావు…పాలమూరు జిల్లాను ఆకుపచ్చ, అన్నపూర్ణ జిల్లాగా మార్చాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టులపై రివ్యూ చేశారని తెలిపారు. చిట్టచివరి ఆయకట్టుకు నీరు అందించేలా పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులకు రీడిజైన్ చేస్తున్నారు. రిజర్వాయర్ల సామర్థ్యం పెంచుకుంటున్నామని తెలిపారు.
గత ప్రభుత్వాలు వదిలేసిన పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కోయిల్‌సాగర్, కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడులను పూర్తి చేసి సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. పాలమూరు ఎత్తిపోతలను యుద్ధప్రతిపాదికన పూర్తి చేసి సస్యశ్యామలంగా మారుస్తామన్నారు.
భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టులను రీడిజైన్ చేస్తున్నాం. కానీ కొందరు పనులను అడ్డుకుంటూ కోర్టుల్లో కేసులు వేశారు. ఇప్పుడిప్పుడే కోర్టు కేసులను పరిష్కరించాం….. త్వరితగతిన పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేస్తామని వెల్లడించారు.